పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కి తాత్కాలిక ఊరట లభించింది. ఆయన నివాసం ఎదుట గురువారం ఉదయం 10 గంటల వరకు పోలీసులు చేపడుతున్న చర్యలను నిలిపివేయాలని లాహోర్ హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ మేరకు లాహోర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తారిఖ్ సలీమ్ షేక్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీసుల చర్యలను సవాలు చేస్తూ పిటిఐ పార్టీ నేత ఫవాద్ చౌదరి లాహోర్ కోర్టును ఆశ్రయించారు. బహుమతులను అమ్ముకున్న కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. లాహోర్ లోని జమాన్ పార్క్ వద్ద ఉన్న ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు.
అయితే పిటిఐ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అరెస్ట్ చేయకుండా పోలీసులకు అడ్డుగా నిలుస్తున్నారు. తాజాగా బుధవారం ఇమ్రాన్ ఖాన్ ను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు.
మంగళవారం నుంచి 24 గంటలుగా ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇమ్రాన్ మద్దతుదారుల నుంచి పోలీసులకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో పీటీఐ మద్దతుదారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యాన్లు, టియర్ గ్యాస్ ఉపయోగిస్తున్నారు.
అక్కడే గుమిగూడిన ప్రజలపై లాఠీఛార్జ్ చేస్తున్నారు. ఈ ఘర్షణలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు పాకిస్తాన్ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఈ మొత్తం ఘర్షణల్లో ఇస్లామాబాద్ డీఐజీ ఆపరేషన్స్ షాజామ్ నదీమ్ బుఖారీతో పాటు 54 మంది పోలీసులు గాయపడ్డారు. మరోవైపు పాక్ పోలీసులతో పాటు ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు పాక్ ఆర్మీ కూడా రంగంలో దిగినట్లు సమాచారం.