గవర్నరుపై అసత్య ప్రచారం చేశారంటూ టిడిపి ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్లు శాసనసభ స్పీకరు తమ్మినేని సీతారాం ప్రకటించారు.
ఈ విషయంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఈ అంశాన్ని ప్రివిలైజ్ కమిటీకి సిఫార్సు చేస్తున్నట్లు స్పీకరు వెల్లడించారు. తానేమి తప్పు చేయకపోయినా, ఏమీ మాట్లాడలేదని, మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వలేదని, తనను ఎలా సస్పెండ్ చేస్తారని స్పీకరును నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.
ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో వివరణ ఇవ్వాలంటూ నిమ్మలకు మద్దతుగా 12 మంది టిడిపి సభ్యులు స్పీకరు పోడియాన్ని ముట్టడించారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని స్పీకరు పోడియం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా మిగిలిన టిడిపి సభ్యులనూ ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకరు ప్రకటించారు.
ఇదే అంశంపై సభలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, అంబటి రాంబాబు, పయ్యావుల కేశవ్ మధ్య వాడీవేడిగా మాటల యుద్ధం సాగింది. స్పీకర్ కార్యాలయంలో గవర్నర్ వేచి ఉండేలా చేశారని పయ్యావుల ఆరోపించినట్లు ఓ దినపత్రికలో వచ్చిన వార్తపై సభలో గందరగోళం జరిగింది. ఇదే విషయంపై సభ ఆలస్యంగా ప్రారంభమైందని, గవర్నరును నేరుగా శాసనసభకు తీసుకురావాలని ప్రొసీడింగ్స్‌లో ఉందని సభలో చదివి పయ్యావుల వినిపించారు.
ఇదే అంశంపై స్పీకరు వివరణ ఇస్తూ రాజ్‌భవన్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం స్పీకరు ఛాంబర్లో రెండు నిమిషాలు ఆగి సభకు వచ్చామని, ఇందులో నిబంధనలు ఏమీ ఉల్లంఘన జరగలేదన్నారు. ఇదే విషయం మంగళవారం రాజ్‌భవన్ సూచనను ఎందుకు సభ్యులకు తెలియజేయలేదని పయ్యావుల ప్రశ్నించారు. అనంతరం మార్షల్స్ రంగ ప్రవేశం చేయడంతో టిడిపి సభ్యులు సభ నుంచి నిష్క్రమించారు.