ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఒక వంక దూకుడుగా వెడుతున్న ఈడీ, మరోవంక అరెస్ట్ తప్పదని గ్రహించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితలకు సంబంధించి గురువారం నాటకీయ పరిణామాలు జరిగాయి. ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ తాజాగా గురువారం విచారణకు హాజరుకావాల్సిన కవితను అరెస్ట్ చేయబోతున్నట్లు కధనాలు వెలువడ్డాయి.
గత శనివారం విచారణకు హాజరైన ఆమెను దాదాపు పది గంటలసేపు ప్రశ్నించి, తిరిగి మరోసారి మార్చి 16వ తేదీన కూడా హాజరుకావాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే గురువారం విచారణకు కవిత దూరంగా ఉన్నారు. పలు కారణాల రీత్యా రాలేనంటూ ఈడీకి తన న్యాయవాది ద్వారా సమాచారం పంపించారు.
ఈడీ విచారణపై స్టే ఇవ్వాలని తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని కవిత పేర్కొన్నారు. విచారణకు ఆమె హాజరుకాకపోవటంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. మార్చి 20వ తేదీన విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.
అయితే ఈడీ దర్యాప్తు అంశంపై ఇప్పటికే కవిత సుప్రీంను ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై మార్చి 24వ తేదీన కోర్టు విచారణ జరపనుంది. ఈ క్రమంలో మార్చి 20వ తేదీన ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 20వ తేదీన కవిత విచారణకు హాజరవుతారా..? ఈడీ ఏం చేయబోతుందనేది చర్చనీయాంశంగా మారింది.
బిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికే ఈడీ దర్యాప్తు పేరుతో వేధిస్తోందని కవిత తరపు న్యాయవాది ఆరోపించారు. కవిత తరపున పలు ఈడీ కోరిన పలు డాక్యుమెంట్లను సమర్పించినట్లు సోమా భరత్ చెప్పారు. మనీలాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50లో నిబంధనలకు విరుద్ధంగా విచారణ చేయడాన్ని ప్రశ్నించినట్లు అడ్వకేట్ తెలిపారు.
ఈడీ కేసుల్లో నిందితులుగా, సాక్ష్యులుగా విచారించడానికి ఉన్న వారి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించి ప్రస్తుతం విచారణ జరిపారని ఆరోపించారు. గతంలో పలు కేసుల్లో సుప్రీం కోర్టు ఆదేశాలు, చట్టాలను ధిక్కరించి ఈడీ అధికారులు వ్యవహరించారని, 15ఏళ్లలోపు పిల్లలు ఉన్న మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు.
