టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ లో కీలక సూత్రధారి రాజశేఖరేనని సిట్ తేల్చింది. టీఎస్ పీస్సీకి అందజేసిన నివేదికలో సిట్ కీలక విషయాలు వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగానే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు. టెక్నికల్ సర్వీస్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన రాజశేఖర్ కారుణ్యానియమకంలో ఉద్యోగంలో చేరాడని గుర్తించారు.
ప్రవీణ్ తో రాజశేఖర్ సంబంధాలు కొనసాగించాడని తెలిపారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తున్న రాజశేఖర్ కంప్యూటర్ ని హ్యాక్ చేసి పాస్ వర్డ్ ని దొంగిలించాడని పేర్కొన్నారు. పాస్ వర్డ్ ని శంకర్ లక్ష్మి ఎక్కడా రాయలేదని, ఆమె చెప్పినదాంతోనే రాజశేఖర్ కంప్యూటర్ ని హ్యాక్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
పెన్ డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను కాపీ చేసిన రాజశేఖర్ పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కు ఇచ్చాడని వెల్లడించారు. ఫిబ్రవరి 27నే రాజశేఖర్ ఏఈ పేపర్ ను కాపీ చేశాడని, ఆ పేపర్ ను ప్రవీణ్ రేణుకకు అమ్మినట్లు గుర్తించారు. గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ లీకైనట్లు సిట్ అధికారులు తేల్చారు. అయితే ప్రవీణ్ కు గ్రూప్ 1లో 103 మార్కులు రావడంపై విచారిస్తున్నారు.
సెక్రటరీ దగ్గర పీఏగా పనిచేస్తూ గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ ను కొట్టేసినట్లు సిట్ నిర్దారించింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది నిందితులకు మరో ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు.
నిందితులను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కు స్పందించిన కోర్టు 6 రోజుల కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. నిందితులను మార్చి 18 నుంచి మార్చి 23 వరకు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు.