కేంద్రమంత్రి అమిత్ షా తో మెగాస్టార్ చిరంజీవి , ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ఓ ఛానల్ కాంక్లేవ్‌కు హాజరయ్యేందుకు వచ్చిన వీరు హోటల్లో భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కిన నేపథ్యంలో రామ్ చరణ్‌కు హోం మంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు.
ఆస్కార్ వచ్చాక తొలిసారిగా ఢిల్లీకి వచ్చిన రామ్ చరణ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. కేంద్ర మంత్రిని చిరంజీవి శాలువాతో సత్కరించారు. సుమారు 15 నిమిషాల పాటు వీరి భేటీ కొనిసాగినట్లు తెలుస్తోంది. ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని అంటోన్న సినీ, రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ఇదిలావుండగా ఇండియా టుడే కాన్ క్లేవ్ ఈవెంట్‌కు రామ్ చరణ్ ను ఆహ్వానించారు. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన వేదికను పంచుకున్నారు.
ఈ సందర్భంగా విడిగా ముగ్గురూ సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపినట్టు సమాచారం. కాంగ్రెస్ హయాంలో రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పని చేసిన చిరంజీవి గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కమలనాథులు చిరంజీవిని తమ వైపు తిప్పుకోవాలని, ఏపీలో ఆయన ప్రచారం చేస్తే బీజేపీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో అల్లూరి విగ్రహావిష్కరణ సందర్భంగా బీజేపీ అగ్రనేతలు చిరంజీవిని పరోక్షంగా ఆహ్వానించారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చిరంజీవి అప్పుడే స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీలో అమిత్ షాతో జరిగిన భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.