శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వానికి తీవ్రమైన ఎదురుగాలి వీచింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమల్లో టిడిపి అభ్యర్థులు భారీ ఆధిక్యతలో విజయం సాధించగా, పశ్చిమ రాయలసీమలో ఆ రెండు పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమైంది.
కాగా, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోనూ వైసిపి గెలుపొందింది. ఉత్తరాంధ్ర శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీగా టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు రెండో ప్రాధాన్య ఓటుతో విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి చిరంజీవిరావుకు 82,958 ఓట్లు దక్కాయి. వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు 55,749 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు 35,148 ఓట్లు పడ్డాయి. బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్‌కు కేవలం 10,884 ఓట్లు పోలయ్యాయి.
తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్‌రెడ్డిపై విజయం సాధించారు. కంచర్ల శ్రీకాంత్ 1,12,686 ఓట్లు సాధించగా…. శ్యామ్ ప్రసాద్ రెడ్డికి 85,423 ఓట్లు వచ్చాయి. అర్ధరాత్రి వరకూ రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కొనసాగింది. పశ్చిమ రాయలసీమ (ఉమ్మడి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్రుల నియోజకవర్గంలో వైసిపి, టిడిపి మధ్య నువ్వా… నేనా అన్నట్టుగా వస్తున్న ఫలితాలు ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. మొత్తం 2,44,307 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 15,104 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 1,92,018 ఓట్లు లెక్కించారు.
మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరిగా వైసిపి అభ్యర్థి వెన్నపూస గోపాలరెడ్డికి 74,678 ఓట్లు, టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డికి 73,229 ఓట్లు వచ్చాయి. 1449 ఓట్ల మోజార్టీతో వైసిపి అభ్యర్థి ఉన్నారు. పిడిపి అభ్యర్థి పోతుల నాగరాజుకు 15,254 ఓట్లు వచ్చాయి.రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ స్వల్ప ఆధిక్యతతో వైసిపి అభ్యర్థులు గెలుపొందారు. తూర్పు రాయలసీమ (ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలు) ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వైసిపి అభ్యర్థి పర్వత చంద్రశేఖర్‌రెడ్డి 1043 ఓట్ల ఆధికత్యతో గెలుపొందారు. పశ్చిమ రాయలసీమ (ఉమ్మడి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు) ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా వైసిపి అభ్యర్థి ఎంవి.రామచంద్రారెడ్డి 169 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.