భవనాల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా సికింద్రాబాద్ లో తరచుగా భారీ భవనాలలో అగ్నిప్రమాదాలు జరుగున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం భారీ అగ్నిప్రమాదంతో ఆరుగురి సజీవ దహనానికి దారితీసిన సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌ను ఆయన ఆదివారం సందర్శించి పరిశీలించిన ఆయన.. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
జరిగిన అగ్నిప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని చెబుతూ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ప్రమాద ఘటనలో పేదలు, అమాయకుల ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ ప్రమాదాలకు కారకులైన వారిపై జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
ప్రమాదం జరిగినప్పుడు చర్యలు తీసుకుంటామంటున్నారు గాని ఆ తర్వాత మర్చిపోతున్నారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. ప్రమాదాల నివారణకు అవసరమైన సామగ్రి కూడా అందుబాటులో ఉండట్లేదని, గోదాములు, స్క్రాప్ దుకాణాలను అధికారులు తనిఖీ చేయట్లేదని విమర్శించారు.
అధికారులు,అగ్నిమాపక సిబ్బంది క్రమం తప్పకుండా అన్ని షాపులను, సంస్థలను ఎప్పటికప్పుడు పరిశీలించి ఏవైనా భద్రతాపరమైన లోపాలుంటే సరిచేసుకునేలా చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలని కేంద్రమంత్రి సూచించారు.
ప్రమాదకరంగా ఉన్న గోదాములను నగర శివారు ప్రాంతాలకు తరలించాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సిబ్బంది కొరత ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారని పేర్కొంటూ ఆ శాఖకు కొత్తగా వచ్చిన పరికరాలను సమకూర్చాలని ఆయనడి సూచించారు.
ప్రభుత్వం ఆదాయం కోసం అక్రమ భవనాలను క్రమబద్ధీకరిస్తోందని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఎక్కువ ఆదాయం వస్తోందని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామనే సంస్థల గురించి నిరుద్యోగ యువత తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాంటి సంస్థలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరోపక్క ఈ ఘటన ఫై సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసి , మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.