చిరుధాన్యాల సంరక్షణకు జీవితాంతం కృషి చేయడమే గాక, సంఘం రేడియో పేర కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ప్రారంభించి నిరక్షరాస్యులైన మహిళలతోనే వ్యవసాయంపై రేడియోకార్యక్రమాలు నిర్వహించిన దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ సతీష్ (77) ఆదివారం కన్నుమూశారు.
మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పేరుగాంచిన పెరియపట్న వెంకటసుబ్బయ్య సతీష్ (పీవీ సతీష్ ) కర్నాటకకు చెందిన వారు. మైసూర్లో జన్మించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, నూఢిల్లిలో గ్రాడ్యుయేట్ అయిన పీవీ సతీష్ జర్నలిస్టుగా జీవితం ప్రారంభించారు.
రెండేళ్ల పాటు దూరదర్శన్‌లో టెలివిజన్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ఆ తర్వాత సామాజిక సేవారంగంలోకి అడుగుపెట్టారు. అది కూడా తన సొంత రాష్ట్రం కర్నాటకను కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్నారు. 1980 లో కొందరు మిత్రులతో కలిసి దక్కన్ డెవలప్మెంట్ సొసైటీని ఏర్పాటు చేసి జహీరాబాద్ కేంద్రంగా సేవా కార్యక్రమాలను 40 ఏళ్ల క్రితం ప్రారంభించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని వందలాది గ్రామాల్లో ఆయన చిరుధాన్యాలపై రైతులను ముఖ్యంగా మహిళలను చైతన్యం చేశారు. పేదరికం, జీవవైవిధ్యం, ఆహార భద్రత, మహిళల సాధికారత, సామాజిక న్యాయంపై వేలాదిమంది మహిళల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఈ అంశాలపై ఆందోళనలు చేపట్టి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
సామాజిక మాధ్యమాలు చదువుకున్న వారికే పరిమితం అనుకుంటున్న దశలో అక్షరాస్యత లేని దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలను ఎలక్ట్రానిక్ జర్నలిస్టులుగా తీర్చిదిద్దారు. కమ్యూనిటీ రేడియోను స్థాపించి వ్యవసాయం,మహిళల సాధికారత, సామాజిక న్యాయం అంశాల్లో చైతన్య తీసుకువచ్చేందుకు కృషి చేశారు.
తాను స్థాపించిన సంఘం రేడియోను కమ్యూనిటీ రేడియో స్టేషన్‌గా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకువచ్చారు. తాను చేపట్టిన సేవా కార్యక్రమాలతో అంతర్జాతీయంగా రాష్ట్రానికి పేరు తీసుకువచ్చారు.