ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టిడిపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపించారు. శాసనసభలో చర్చ జరుగుతుండగా టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. పోటీగా వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగడంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ జరిగింది. వాయిదా తీర్మానంపై టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో తలెత్తిన వివాదం వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణగా మారింది.
టీడీపీ సభ్యుల నిరసనకు పోటీగా వైసీపీ నేతలు ఆందోళనకు దిగిన క్రమంలో తమపై దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలపడంతో మొదలైన ఘర్షణ తోపులాటకు దారి తీసింది. టీడీపీ ఎమ్మెల్యేలకు పోటీగా వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకోవడంతో ఘర్షణ జరిగింది.
ఈ క్రమంలో పోడియం వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై వైసిపి ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. సభలో స్పీకర్ సమక్షంలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని టీడీపీ నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఇతర సభ్యులు మీడియా పాయింట్ దగ్గర ఆరోపించారు.
తమ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, సీనియర్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైఎస్సార్సీపీ సభ్యులు దాడి చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 75 ఏళ్ల వయసున్న వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్యపై మాజీ మంత్రి వెల్లంపల్లి దాడి చేశారని ఆరోపించారు.
రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో నిరసనల్ని నిషేధిస్తూ జారీ చేసిన ‘జీవో1 రద్దు చేయాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చినా, దానిని స్పీకర్ అంగీకరించలేదని, పోడియం దగ్గర నిరసన తెలిపామని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పారు. తాము తప్పు చేస్తే స్పీకర్ చర్యలు తీసుకుని తమనుసస్పెండ్ చేయాలని, వైసీపీ నాయకులు ఎందుకు దాడి చేశారని ప్రశ్నించారు.
స్పీకర్ సమక్షంలో తనపై దాడి చేశారని, డిచేసిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తనపై సుధాకర్ బాబు, ఎలీజా దాడి చేశారని, స్పీకర్ పోడియం వద్ద ఉన్న తన మీదకు వద్దకు వచ్చి దాడి చేశారని, దాడి చేసిందిగాక మళ్లీ మాపైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎక్కడా కట్ చేయకుండా సభ మొత్తం వీడియో బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఇచ్చిన వాయిదా తీర్మానం కోసం పట్టుపడితే తనపై దాడి చేస్తారా అని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ప్రశ్నించారు.
మరోవైపు అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. అసెంబ్లీ చరిత్రలో ఇవాళ చీకటిరోజని, రాష్ట్ర చరిత్రలో సభలో ఎమ్మెల్యేపై దాడి ఎప్పుడూ లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రోద్భలంతోనే దళిత సభ్యుడు స్వామిపై దాడి చేశారని ఆరోపించారు.
కాగా, . టీడీపీ సభ్యులు తనను సీటు నుంచి తోసేందుకు ప్రయత్నించారని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు. కాగితాలు చింపి తనపై వేసేందుకు ప్రయత్నించినా తాను వాటిని పూవులుగానే భావించానని, తానేమి గౌతమ బుద్ధుడిని కాదని స్పష్టం చేశారు. టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయమని, సభకు, సభాపతి స్థానానికి గౌరవం లేకుండా వ్యవహరించారని విమర్శించారు.