బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను సోమవారం సుమారు 10 గంటల పాటు ఈడీ లిక్కర్ కుంభకోణం కేసులో విచారించింది. తిరిగి మంగళవారం కూడా ఆమెను ఉదయం 11 గంటలకు విచారణకు హాజరకావలసిందిగా నోటీస్ జారీ చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కేసులో రెండో సారి ఈడీ ఎదుట కవిత విచారణకు హాజరయ్యారు. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఈడీ అధికారులు 10 గంటల పాటు ప్రశ్నించారు. ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన కవిత రాత్రి 9.14 నిమిషాలకు బయటకు వచ్చారు. అక్కడ నుంచి నేరుగా ఆమె కెసిఆర్ నివాసానికి బయలుదేరి వెళ్లారు.
డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత సంతకాలు కూడా తీసుకున్నారు. ఈడీ సంధించిన పలు ప్రశ్నలకు కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదని తెలిసింది. మొత్తం 20 ప్రశ్నలు కవితకు సంధించినట్లు తెలిసింది. ఉదయం కవిత, అరుణ్ పిళ్లైని కలిపి ఈడీ అధికారులు విచారించారు.
ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్ఫ్రంటేషన్ పద్దతిలో కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు.
మార్చి 11న మెుదటిసారి కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ రోజున ఎనిమిది గంటలపాటు ఈడీ విచారణ చేసింది. ఆ తర్వాత తన న్యాయవాదితో ఈడీ కోరిన సమాచారం పంపించారు. మరోవైపు ఈడీ తనను వేధిస్తోందని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 24న కవిత పిటిసన్ విచారణకు రానుంది.
ఢిల్లీ కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన అరుణ్పిళ్లైతో కవితను ముఖాముఖి కూర్చోబెట్టి ప్రశ్నించాలని అధికారులు భావించినా, అందుకు పిళ్లై అంగీకరించ కపోవడంతో, పిళ్లైను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈడీ కస్టడీ ముగియడంతో జైలుకు పంపించారు.
ఈ కుంభకోణంలో కవిత పాత్రకు సంబంధించి తమ వద్ద ఉన్న అన్ని సాక్ష్యాలతో ఆమెను విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్, ఢిల్లీలో ఒబెరాయ్ హోటల్ సమావేశాలకుసంబంధించిన పత్రాలను ఆమెకు చూపించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై సౌత్ గ్రూప్ తరఫున, కవిత తరఫున జరిపిన సంభాషణలనూ వారు ఆమెకు వినిపించి, ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.