ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ సాగిన ఎంఎల్ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించారు. గెలుపునకు అవసరమైన 23 ఓట్లు ఆమెకు లభించాయి. వైసిపి నుంచి క్రాస్ ఓటింగ్ జరగడంతో అనురాధను విజయం వరించింది.
అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాలి. కానీ అనురాధకు 23 ఓట్లు పడ్డాయి. సాంకేతికంగా టిడిపికి 23 స్థానాలు ఉన్నప్పటికీ. . ఎంఎల్ఎలు వల్లభనేని వంశీ (గన్నవరం), కరణం బలరాం (చీరాల), మద్దాళి గిరి (గుంటూరు పశ్చిమ), వాసుపల్లి గణేశ్‌కుమార్ (విశాఖ దక్షిణం) వైఎస్ఆర్సిపికి ఫిరాయించారు.
నలుగురు ఎంఎల్ఎలు పార్టీ ఫిరాయించడంతో టిడిపికి 19 సీట్లు మాత్రమే ఉన్నాయి. దానితో తమ ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగలరని ధీమాతో వైసిపి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, ఆ మరుసటిరోజే టిడిపి అనూహ్యంగా విజయవాడ మాజీ మేయర్ అనురాధను పోటీకి నిలబెట్టడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
టిడిపి కూడా వ్యూహాత్మకంగా బిసి మహిళను ఈ ఎన్నికల్లో నిలబెట్టింది. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణలతో పాటు పలువురు వైసిపి ఎంఎల్ఎలు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాగా, ఈ ఎన్నికలో పంచుమర్తి అనురాధ అనూహ్యంగా గెలుపొందారు.
ఈ ఎన్నికలో వైసిపి అధినేత, ముఖ్కమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, టిడిపి అధి అధినేత చంద్రబాబు నాయుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందమూరి బాలకృష్ణ, టిడిపి, వైసిపి ఎంఎల్ఎలు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండపేట ఎంఎల్ఎ జోగేశ్వరరావు వీల్ చెయిర్లో వచ్చి మరీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎంఎల్ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో కేవలం 19 మంది ఎంఎల్ఎల బలం మాత్రమే ఉన్న టిడిపికి 23 మంది ఎంఎల్ఎల ఓట్లు పడ్డాయి. వైసిపికి చెందిన నలుగురు ఎంఎల్ఎల క్రాస్ ఓటింగ్ పడింది. వీరిలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఓట్లు టిడిపికి పడ్డాయనే విషయంలో ఎలాంటి సందేశం లేదు.
టిడిపికి ఓటు వేసిన మరో ఇద్దరు వైసిపి ఎంఎల్ఎలు ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. ఊహించని విధంగా అనురాధ ఎంఎల్‌సిగా విజయం సాధించడంతో టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.