దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం హైఅలర్ట్ జారీ చేసింది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అడ్వైజరీని జారీచేశాయి.
ఈ అడ్వైజరీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ సంతకాలతో వెలువడింది. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని అడ్వైజరీలో పేర్కొన్నారు. కరోనాపై అప్రమత్తమైన కేంద్రం సోమవారం రాష్ట్రాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది
దేశంలో పెరుగుతున్న కరోనా, సీజనల్ ఇన్ఫ్లుఎంజా కేసుల నేపథ్యంలో ఆసుపత్రుల సంసిద్ధతను సమీక్షించడానికి ప్రభుత్వం ఏప్రిల్ 10, 11 తేదీలలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌ను ప్లాన్ చేస్తోందని అడ్వైజరీలో పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య సౌకర్యాలలో మందులు, ఆసుపత్రి పడకలు, వైద్య పరికరాలు, వైద్య ఆక్సిజన్ లభ్యతను అంచనా వేసే లక్ష్యంతో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్టుగా తెలిపారు.
మాక్ డ్రిల్ కచ్చితమైన వివరాలను మార్చి 27న షెడ్యూల్ చేయబడిన వర్చువల్ సమావేశంలో అన్ని రాష్ట్రాలకు తెలియచేస్తామని పేర్కొన్నారు. కాగా గడిచిన 24 గంటల్లో 1,590 తాజా కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. ఆరు కరోనా మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
అయితే, కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, ఆందోళన కలిగించే పరిస్థితులేమీ లేవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనాతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉందని వివరించింది. ఇన్‌ఫ్లూయెంజా వ్యాధులు కూడా ఇప్పుడే ప్రబలుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పరిస్థితులను సమీక్షించి ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం చేయాలని సూచించింది.