శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఎల్వీఎం-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. వన్‌వెబ్‌కు చెందిన 5.8 టన్నులున్న 36 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. 20 నిమిషాలు ప్రయాణించిన అనంతరం 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న నిర్ధేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది.
వెంటనే ఆ ఉపగ్రహాలను యూకేలోని గ్రౌండ్ స్టేషన్ నుంచి తమ ఆధీనంలోకి తీసుకుని నియంత్రించనున్నారు. నిన్నటి నుంచి కొనసాగుతున్న కౌంట్ డౌన్ పూర్తయిన వెంటనే నిప్పులు చిమ్ముకుంటూ పైకి ఎగిసింది.
ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగానికి బ్రిటన్‌కు చెందిన వన్‌వెబ్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబరు 23న విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
తాజాగా రెండో దశలో 36 ఉపగ్రహాలను ఎల్వీఎం-3 ద్వారా పంపారు. ఒక్కొక్క ఉపగ్రహం బరువు 150 కిలోలు. జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ అయిన లాంచ్ వెహికల్ మార్క్-3 ద్వారా ఈ ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ఎల్వీఎం-3 ద్వారా ఇస్రో చేపట్టిన రెండో వాణిజ్య ప్రయోగం ఇది.
ఎల్ఎంవీ 3 రాకెట్ సుమారు నాలుగు టన్నుల బరువైన ఉపగ్రహాలను జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వరకు మోసుకెళ్లగలదు. జియోసింక్రనస్ ఆర్బిట్ భూ మధ్య రేఖకు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అంతకు ముందు ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ శనివారం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.