ఏపీ శాసనసభ స్పీకర్ లా అడ్మిషన్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. డిగ్రీ మధ్యలో ఆపేసిన స్పీకర్ తమ్మినేనికి ఉస్మానియా యూనివర్శిటీలో లా అడ్మిషన్ ఎలా వచ్చిందని టీడీపీ నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. 2019 ఎన్నికల అఫిడవిట్లో శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రెండో ఏడాదితో కోర్సు ఆపేసినట్లు పేర్కొన్న తమ్మినేని డిగ్రీ ఎప్పుడు పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
డిగ్రీ పాస్ కాకుండా లా కోర్సులో ఎలా చేరారని, డిగ్రీ పూర్తి చేయకుండానే సర్టిఫికెట్ ఫోర్జరీ చేసి ఉంటారని ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి, సీజేఐ, గవర్నర్లకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.
డిగ్రీ విద్యను మధ్యలో ఆపేసిన ఏపీఅసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మూడేళ్ల లా డిగ్రీ కోర్సులో ఎలా అడ్మిషన్ పొందారని టీడీపీ ప్రశ్నిస్తోంది. డిగ్రీ విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేసిన తమ్మినేని సీతారాం, ఏ విద్యార్హతతో లా కోర్సులో ప్రవేశం పొందారని ప్రశ్నించారు.రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌కు ఉస్మానియగా యూనివర్శిటీ అధికారులు ఏమైనా మినహాయింపులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. తమ్మినేని తన విద్యార్హతలేమిటో బయట పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి డిగ్రీ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించి మూడు సంవత్సరాల న్యాయ విద్యలో అడ్మిషన్ పొందిన తమ్మినేని సీతారాం వ్యవహారాన్ని ఆధారాలతో సహా శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్ బయటపెట్టారు. రాజ్యంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు కొన్ని విలువలు పాటించాలని పేర్కొంటూ తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా వైసీపీ ప్రతిపాదిస్తే.. టీడీపీ, జనసేన కూడా మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా స్పీకర్ ఉండాల్సిన స్పీకర్ అలా ఎప్పుడు వ్యవహరించలేదని విమర్శించారు.
2019లో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లో ఎలక్షన్ కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్లో డిగ్రీ పూర్తి చేయలేదని నోటరీ చేసి సమర్పించిన ఆయన, 2019లో హైదరాబాద్ లోని మహాత్మగాంధీ లా కాలేజీలో లా కోర్స్‌లో చేరారని తెలిపారు. డిగ్రీ పాస్ కాకుండా… బి.ఎల్ కోర్సులో ఏ రకంగా చేరారని ప్రశ్నించారు. సీతారాంకు విలువలు ఉంటే… తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.