గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 150 మార్కులకు గానూ వందకు పైగా మార్కులు సాధించిన దాదాపు 121 మంది అభ్యర్థుల్లో 70 మంది విచారణను సిట్ పూర్తిచేసింది. కొందరు అభ్యర్థులు ఫోన్లోనే సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. గతంలో వారు రాసిన యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ పరీక్షల ఫలితాల వివరాలను కూడా సిట్ అధికారులు సేకరించి పరిశీలించారు.
ఈ అభ్యర్థులంతా ఏండ్లుగా పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఎఫీషియెన్సీ టెస్ట్ ఆధారంగా వారికి పేపర్ లీకేజీతో సంబంధం లేదని సిట్ అధికారులు తేల్చారు. దీంతో100కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థుల విచారణ దాదాపుగా పూర్తి కావచ్చింది.
సిట్అధికారులు గ్రూప్1 అభ్యర్థులను విచారిస్తూనే.. ఏఈ పేపర్ లీక్ నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. నిందితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ధాక్యా నాయక్‌కు, అభ్యర్థులకు మీడియేటర్‌గా వ్యవహరించిన తిరుపతయ్యను సోమవారం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.
తర్వాత అతడిని రిమాండ్ కోసం చంచల్‌గూడ జైలుకు తరలించారు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య15కు చేరింది. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సల్కర్‌పేటకు చెందిన తిరుపతయ్య.. షాద్‌నగర్ నేరెళ్ల చెరువుకు చెందిన రాజేంద్ర కుమార్‌కు ఏఈ పేపర్ సేల్ చేసినట్టు వెలుగు చూసింది. పేపర్ కోసం రాజేంద్రకుమార్ రూ.5 లక్షలు ధాక్యానాయక్కు ఇచ్చాడు.
దీంతో తిరుపతయ్యను కూడా కేసులో నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా మరో ముగ్గురిని విచారిస్తున్నారు. రాజేంద్రకుమార్, తిరుపతయ్యలను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేశారు. రెండో రోజు కస్టడీలో భాగంగా నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, ధాక్యానాయక్, రాజేశ్వర్లను సోమవారం విచారించారు.
కాల్ డేటా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా కాంటాక్ట్స్ మ్యాపింగ్ చేస్తున్నారు. రాజేంద్రకుమార్ కోచింగ్ తీసుకున్న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, అభ్యర్థుల వివరాలనూ సేకరించారు. వీరిలో ఎవరైనా గ్రూప్1, ఏఈ పరీక్షలు రాశారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.
ఈ కేసులో రాజశేఖర్ రెడ్డికి బావ వరుసయ్యే ప్రశాంత్ కోసం లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసినట్టుగా సమాచారం. ప్రశాంత్ న్యూజిలాండ్‌లో ఉంటుండగా అతనికి రాజశేఖర్ ద్వారా గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం చేరింది. దీంతో ప్రశాంత్ అక్కడే పేపర్లో ప్రశ్నలకు జవాబులు ప్రిపేర్ అయి ఇక్కొడికి వచ్చి పరీక్ష రాశాడు. అనంతరం తిరగి న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. ప్రశాంత్‌కు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100కు పైగా మార్కులు కూడా వచ్చినట్టుగా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది.