పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్ )కు ఆధార్ అనుసంధానం తుది గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు గడువును పెంచింది. ఈ విషయంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సిబిడిటి) మంగళవారం అధికారిక ప్రకటన చేసింది.
గడువు ముగిసేలోగా పాన్ – ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకోవాలని, లేకపోతే జూలై 1 నుంచి పాన్ నిరర్ధకంగా మారుతుందని స్పష్టం చేసింది. అంటే ఆధార్ – పాన్ అనుసంధానం జూన్ 30లోగా పూర్తి చేసుకోకుంటే ఆ తర్వాత పాన్ కార్డు పని చేయదు. పాన్‌కు సంబంధించిన కార్యకలాపాలు ఆగిపోతాయి.
పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి వుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు ముగిసింది. అయితే వెయ్యిరూపాయిల జరిమానాతో మార్చి 31లోపు అనుసంధానం చేసేందుకు చివరి అవకాశం ఇచ్చింది. తాజాగా ఆ గడువును మరో మూడు నెలలు పొడిగించింది.
పాన్ – ఆధార్ అనుసంధానం తుది గడువు మార్చి 31గా ఉండగా, ఇప్పుడు దాన్ని జూన్ 30 వరకు పొడిగించింది కేంద్రం. ఇంకా అనుసంధానం చేసుకోని వారు www.incometax.gov.in వెబ్సైట్లో పాన్ – ఆధార్ లింక్ చేసుకోవచ్చు. హోమ్ పేజీలో లింక్ యువర్ పాన్ బటన్‌పై క్లిక్ చేసి.. ఆ తర్వాత స్టెప్స్ ఫాలో అవ్వాలి. అడిగిన వివరాలు సమర్పించాలి.