శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో వేడుకలు వైభవంగా జరిగాయి. ఆకాశమంత పందిరి, భూదేవంత మండపం, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తజన సందోహం మధ్య రాములోరి కల్యాణోత్సవం కనులపండువగా సాగింది.
స్టేడియంలోని కల్యాణ పీఠంపై ఉత్సవమూర్తులను ఉంచి రామయ్య గుణగణాలు, సీతమ్మ అణకువ, అంద చందాలను వర్ణించారు. భక్త రామదాసు సీతారాముల కోసం చేయించిన ఆభరణాలు, ఆలయ క్షేత్ర ప్రాశస్త్యం, కల్యాణ మహోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో జగన్మాత సీతమ్మ మెడలో శ్రీరామచంద్రుడు మాంగల్య ధారణ చేశారు.
ఈ మహోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ రెడ్డి దంపతులు హాజరై ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వామి వారికి అందజేశారు. మిథిలా మైదానంలో కిక్కిరిసిన భక్తజనసందోహం మధ్య త్రిదండి చినజీయస్వామి సమక్షంలో అర్చకులు సాంప్రదాయ బద్ధంగా కల్యాణ క్రతువును వైభవంగా జరిపించారు.
తొలుత భద్రాద్రి రామునికి దేవాలయంలో ద్రువమూర్తుల కల్యాణం చేశారు. తరువాత మంగళవాయిద్యాలు మార్మోగుతుండగా.. భక్తుల జయజయ ధ్వానాల మధ్య పల్లకీలో కల్యాణ మండపానికి స్వామివారు తరలివచ్చారు. ముందుగా తిరుకల్యాణానికి సంకల్పం చేసి సర్వ విజ్ఞాన శాంతి కోసం విశ్వక్సేన పూజ నిర్వహించారు.
విష్ణు సంబంధమైన అన్ని పూజా శుభ కార్యక్రమాలకు విశ్వక్సేణుడి పూజ చేయడం ఆనవాయితీ. ఈ తంతు జరిగాక పుణ్యహవచనం చేశారు. మంత్ర పూజల్లో కల్యాణానికి వినియోగించే సకల సామాగ్రికి ప్రోక్షణ చేశారు. ప్రతి ఏడాది కంటే ఈసారి భిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించారు. ఈసారి సువర్ణ ద్వాదశ వాహనాలపై సీతారాముల్ని ఊరేగించారు. భక్తరామదాసు కాలంలో ఇలా సువర్ణ ద్వాదశ ఊరేగింపు కార్యక్రమం జరిగిందని అర్చకులు తెలిపారు.
గురువారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాతసేవ నిర్వహించారు. అనంతరం నివేదన, షాత్తుమురై, మూలవరులకు అభిషేకం నిర్వహించారు. మంగళశాసనాలు పఠించారు. గర్భగుడిలోని మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేపట్టారు.
తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆ కల్యాణమహోత్సవంలో పాల్గొన్నారు. ప్రభుత్వం భక్తులకు ఎటువంటి లోటుపాట్లు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. కల్యాణం వీక్షించేందుకు వీఐపీతో పాటు 26 సెక్టార్లు.. ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ఇక శుక్రవారం స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు.