భారత స్టార్ బాక్సర్, రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ శనివారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో నిఖత్ జరీన్ పసిడి పతకం సాధించిన విషయం తెలిసిందే.
వరుసగా రెండు వరల్డ్‌కప్ టోర్నీల్లో స్వర్ణాలు సాధించి తెలంగాణ ఆణిముత్యం నిఖత జరీన్ చరిత్ర సృష్టించింది. వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత తొలిసారి సొంత గడ్డపై అడుగు పెట్టిన నిఖత్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
నిఖత్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్ వేణుగోపాలాచారి, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు చాముండేశ్వరి నాథ్, వివిధ క్రీడా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
మార్చి 26వ తేదీన ఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో 50 కేజీల కేటగిరీలో వియత్నాం బాక్సర్ ఎన్‌గెయెన్ థి టామ్‌పై జరీన్ పూర్తి ఆధిపత్యం కొనసాగించి 5-0తో విజయం సాధించింది. చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకంతో పాటు సుమారు రూ.82 లక్షల నగదు బహుమతి కూడా నిఖత్ ఖాతాలో చేరింది.
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్‌కు ఇది రెండో స్వర్ణ పతకం. 2022లో 52 కిలోల విభాగంలో నిఖత్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది.