మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.60 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్రం తెలిపింది. మార్చిలో గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ వసూళ్లు అంతకు ముందు సంవత్సరం కన్నా 13% పెరిగి రూ. 1,60,122 కోట్లకు చేరుకుంది. జూలై 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇది రెండో అత్యధిక వసూళ్లు నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.5 లక్షల కోట్లను దాటడం ఇది నాలుగోసారి.
ఇందులో కేంద్ర జీఎస్టీ రూ.29,546 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ.37,314 కోట్లు అని వివరించింది. ఐజీఎస్టీ కింద రూ.82,907 కోట్లు వసూలైంది. ఐజీఎస్టీ వసూళ్ల పరంగా ఇది ఆల్ టైమ్ రికార్డు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఐజీఎస్టీ వసూలు కాలేదు. ఇక, మార్చి నెలలో సెస్ ల రూపంలో రూ.10,355 కోట్లు వసూలైనట్టు కేంద్రం తెలిపింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలలోనే అత్యధికంగా ఐజీఎస్టీ వసూలైంది. జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్స్ మార్చి నెలలో అత్యధికంగా జరిగాయి. మొత్తం మీద 2022 -23 ఆర్థిక సంవత్సరంలో రూ. 18.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. అంటే, సగటును ప్రతీ నెల రూ. 1.51 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది.