తెలుగు సినీ పరిశ్రమలో విషాదల పరంపర కొనసాగుతూనే ఉంది. సీనియర్ నటుడు కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున చెన్నై తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నిర్మాతగానే కాకుండా.. తనదైన నటనతో, విలనిజంతో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. విజయనగరం జిల్లా, లక్కవరపు కోటలో జన్మించిన కృష్ణ మాదాసు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత కాస్ట్యూమ్స్ కృష్ణగా స్థిరపడిపోయారు. సినిమా పరిశ్రమలో కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ నిర్మాతగా, నటుడిగా మారిన ఆయన ఎన్నో గుర్తిండిపోయే పాత్రలలో నటించారు
ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి వంటి స్టార్ హీరోలకు, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి స్టార్ హీరోయిన్లకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన భారత్ బంద్ చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నిర్మాతగానూ చాలా సినిమాలను నిర్మించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణతో ‘అశ్వద్దామ’, కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘పెళ్ళాం చెపితే వినాలి’, ‘మా ఊరు మారదు’, ‘పుట్టింటికి రా చెల్లి’, జగపతి బాబుతో ‘పెళ్లి పందిరి’ వంటి హిట్ చిత్రాలు నిర్మించారు.
కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని అరుంధతి పేరుతో రీమేక్ చేశాడు. కాస్ట్యూమ్ కృష్ణ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ‘కాస్ట్యూమ్ కృష్ణ మరణ వార్త వినడానికి బాధగా ఉంది. కుటుంబ సభ్యులకు సానుభూతి’ అని దిల్ రాజు ట్వీట్ చేశాడు.