ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడపాలని భావిస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది.
ఈ ఏడాది సంక్రాంతి రోజున ప్రధాని మోదీ సికింద్రాబాద్- విశాఖపట్టణం వందేభారత్ ను వర్చ్చువల్ గా ప్రారంభించారు. అదే రోజున కేంద్ర రైల్వే మంత్రి తెలుగు రాష్ట్రాలకు మరో మూడు వందేభారత్ రైళ్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. అందులో ఇప్పుడు సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.
నారాయణాద్రి రూటులో గుంటూరు మీదుగా ఈ రైలును నడపాలని నిర్ణయించారు. రైల్వే బోర్డు నుంచి ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేతుల మీదుగా ఈ కొత్త సర్వీసును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీని ద్వారా సికింద్రాబాద్ నుంచి ఏడు గంటల్లోనే తిరుపతి చేరుకొనే అవకాశం ఉంటుంది.
సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రయాణ సమయాన్ని 8.30గంటలకు పరిమితం చేశారు. ట్రైన్ నంబర్ 20701గా బయలుదేరే ఈ రైలు సికింద్రాబాద్లో ఉదయం 6గంటలకు బయలుదేరుతుంది. నల్గొండకు 7.19, గుంటూరుకు 9.45కు చేరుతుంది. ఒంగోలుకు ఉదయం 11.09కు, నెల్లూరుకు 12.29కు, తిరుపతికి 14.30కు చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో తిరుపతిలో 20702 వందే భారత్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 3.15కు బయలుదేరుతుంది. సాయంత్రం 5.20కు నెల్లూరు, ఆరున్నరకు ఒంగోలు, 7.45కు గుంటూరు, 10.10కు నల్గొండ, 11.45కు సికింద్రాబాద్ చేరుతుంది. మంగళవారం మినహా వారంలో ప్రతిరోజు రైలును నడిపేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు.
హైదరాబాద్ పర్యటనలో బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేసే పనిలో ఉంది. మరోవైపు ఇదే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటన ఆసక్తికరంగా మారింది.