సొంతంగా పాదయాత్ర చేసినా తెలంగాణాలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగలేక పోతున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉమ్మడి పోరాటాల పేరుతో ప్రతిపక్షాలతో చేతులు కలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటగా, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు ఫోనులు చేసి పేపర్ లీకేజి వ్యవహారంపై ఉమ్మడిగా పోరాటం చేద్దామని, ప్రగత్ భవన్ కు మార్చ్ నిర్వహిద్దామని ప్రతిపాదించారు.
అయితే జాతీయ స్థాయిలో ప్రధాన రాజకీయ ప్రత్యర్ధ్లులుగా ఉంటున్న ఈ రెండు పార్టీల నేతలు తెలంగాణాలో చేతులు కలపడం `ఆత్మహత్య సదృశ్యం’ అని గ్రహించినట్లున్నారు. ఆమె ఫోనులకు సానుకూలంగా స్పందించలేదు. అయినా ఆమె తన ప్రయత్నాలను విరమించుకోకుండా ఇప్పుడు అన్ని ప్రతిపక్షాలకు లేఖలు వ్రాసారు.
నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, తెలంగాణ జన సమితి, జనసేన, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎమ్మాఆర్ పీఎస్ లతో పాటు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు తమతో కలిసి రావాలని ఆ లేఖలలో ఆమె కోరారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ప్రతిపక్షాలంతా ఏకతాటి మీదకు రావాల్సిన అవసరం వచ్చిందని ఆమె పేర్కొన్నారు.
సర్కారుపై నిరుద్యోగ సైరన్ మోగించాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పిలుపిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జెండాలు వేరైనా ఒకే అజెండాగా ఏకమైన పార్టీలు నేడు స్వరాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం మళ్లీ ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందని షర్మిల హితవు చెప్పారు. 1200 మంది ఆత్మబలిదానాల మీద ఏర్పడిన తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు.
బిస్వాల్ కమిటీ 1.91 లక్షల ఖాళీలు ఉన్నాయని తేల్చి చెబితే, కేసీఆర్ మాత్రం 80 వేల ఖాళీలు మాత్రమే ఉన్నాయని ప్రకటించారని, అవి కూడా భర్తీ చేయడం లేదని ఆమె విమర్శించారు. ఇచ్చిన నోటిఫికేషన్లలో ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.