సంక్షోభ నివారణకు ఆగేయాసియా (ఏషిియాన్)దేశాలు ఈ ప్రాంతంలో స్థానిక కరెన్సీ వాడకం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. డాలర్ వంటి ప్రధాన అంతర్జాతీయ కరెన్సీలపై ఆధారపడడం వల్ల గ్లోబల్ సంక్షోభంలో తాము కూడా కూరుకుపోయే ప్రమాదముందని ఈ దేశాలు గ్రహించాయి.
అందుకే డాలర్ల వాడకాన్ని వీలున్నంతమేరకు వాడకుండా ఉండాలని నిర్ణయించుకున్నాయి. గత వారం బాలిలో జరిగిన ఏషియాన్ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సమావేశంలో ఈ మేరకు తీర్మానించుకున్నట్లు ఇండొనేషియా సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ సమావేశానికి ఇండొనేషియా ఈసారి అధ్యక్షత వహించింది. డాలర్ నుండి లోకల్ కరెన్సీకి పరివర్తనా ప్రక్రియను రూపొందించేందుకు ఏషియాన్ ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తుందని ఆ సంస్థ చైర్మన్ పెర్రీ వార్జియో తెలిపారు.
ఈ ప్రాంత దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలన్నీ స్థానిక కరెన్సీలోనే జరపాలని, ఏవైనా వివాదాలు తలెత్తితే వాటిని కో-ఆపరేషన్ ఫ్రేమ్వర్కు పరిధిలో పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. స్థానిక కరెన్సీలో లావాదేవీలు పెరగడం వల్ల అది ఈ ప్రాంత దేశాల సరిహద్దుల మీదుగా జరిపే వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవచ్చని చెప్పారు.