ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సినిమా థియేటర్లపై అధికారులు దాడులు చేసి పలు థియేటర్లను మూసివేయడం, ప్రభుత్వం నిర్ణయించిన మేరకు టికెట్లను విక్రయించాలని ఆదేశించడంతో పలు థియేటర్ల యజమానులు స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసివేశారు. తూర్పు గోదావరి జిల్లాలో మైనర్, మేజర్ పంచాయతీల్లోని 60 సినిమా థియేటర్లను మూసివేశారు.
ప్రభుత్వం నిర్ధేశించిన రేట్లకే టికెట్ల అమ్మకాలు కొనసాగించాలని చెప్పడం, ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించడమే కారణమని థియేటర్ యజమానులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 140 సినిమా థియేటర్లు ఉన్నాయి.
ప్రభుత్వం జారీ చేసిన జిఒ నెంబర్ 35 ప్రకారం పంచాయతీల్లో నాన్ ఎసి థియేటర్లలో తరగతుల వారీగా రూ.5, రూ.10, రూ.15, చొప్పున ఎసి థియేటర్లలో తరగతుల వారీగా రూ.10, రూ.15, రూ.20 చొప్పున టికెట్లను విక్రయించాల్సి ఉంది.
ప్రభుత్వం నిర్ధేశించిన ఈ ధరలను అమలు చేస్తే కరెంట్ బిల్లులు సైతం రావని థియేటర్ యజమానూలు వాపోతున్నారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 37 సినిమా థియేటర్ల మూసివేతకు అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
మరోవంక, టికెట్ ధరలను తగ్గించడం అంటే ప్రేక్షకులను అవమానించడమే అంటూ ప్రముఖ నటుడు నాని చేసిన విమర్శలు కలకలం రేపుతున్నాయి. “సినిమా హాళ్ల యజమానులు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇప్పుడు టికెట్ ధరల తగ్గింపుతో వారంతా భారీగా నష్టపోవడం ఖాయం” అంటూ చెప్పుకొచ్చారు.
నాని వ్యాఖ్యలను నిర్మాత శోభు యార్లగడ్డ సమర్థిస్తూ ఏపీలో టికెట్ ధరల వ్యవహారం చిత్రసీమపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ధరలను నిర్ణయించేది వస్తువు తయారీదారులే కానీ ప్రభుత్వాలు కాదని స్పష్టం చేశారు.