దేశంలోనే తొలిసారిగా అన్నట్టుగా జలాంతర్భాగంలో మెట్రో రైలును నడిపేందుకు కోల్‌కతా మెట్రో రైల్ కార్పోరేషన్ (కేఎంఆర్సీ) సన్నాహాలు చేస్తున్నది. హుగ్లీ నదిలో సొరంగ మార్గం ద్వారా నదికి పశ్చిమ ఒడ్డున హౌరా స్టేషన్ కాంప్లెక్స్‌ను జలాంతర్భాగంలో నడిచే మెట్రో రైలు తూర్పు ఒడ్డున ఆర్మేనియన్ ఘాట్‌తో కలుపుతుంది.
ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ చేపట్టడానికి కేఎంఆర్సీ రంగం సిద్ధం చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ట్రయల్ రన్ నిర్వహించే తేదీని ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించాయి. తూర్పు-పశ్చిమ మెట్రో లైన్ కారిడార్ (గ్రీన్ లైన్) ప్రస్తుతం 9.3 కి.మీల మేర సాల్ట్ లేక్ సెక్టార్ ఐదు నుంచి సెల్దా స్టేషన్ వరకు విస్తరించి ఉంది.
హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లనేడ్ వరకు నది అంతర్భాగంలో నిర్మించిన మెట్రో రైలు మార్గం ఈ ఏడాదిలోగా ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నట్టు కేఎంఆర్సీ వర్గాలు తెలిపాయి. ఇది ప్రయాణికులను ఎస్ప్లనేడ్ వద్ద ఉత్తర-దక్షిణ కారిడార్‌కు (బ్లూ లైన్) మారడానికి ఉపకరిస్తుంది.
నది అంతర్భాగంలో మెట్రో రైలు మార్గంపై రైళ్ళ రాకపోకలు మొదలైన మరుక్షణం ప్రపంచంలోనే భూతలం నుంచి 30 అడుగుల లోతులో నిర్మించిన మెట్రో రైలు స్టేషన్లలో ఒకటిగా హౌరా మెట్రో రైలు స్టేషన్ నిలుస్తుందని వారు వెల్లడించారు.
ఈ మార్గంలో హౌరా మైదాన్, హౌరా స్టేషన్ కాంప్లెక్స్, బీబీడీ బాగ్(మహాకరణ్), ఎస్ప్లనేడ్, సీల్దా, ఫూల్‌బాగన్, సాల్ట్ లేక్ స్టేడియం, బెంగాల్ కెమికల్, సిటీ సెంటర్, సెంట్రల్ పార్క్, కరుణామోయి, సాల్ట్ సెక్టార్-5 స్టేషన్లు ఉన్నాయి.