ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో బిఆర్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. బిఆర్ఎస్ నిర్వహిస్తున్న సభ సందర్భంగా కార్యకర్తలు బాణా సంచా పేలుస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. బాణాసంచా నిప్పు రవ్వలు సమీపంలోని గుడిసెపై నిప్పంటుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
దీంతో అందులో ఉన్న సిలిండర్లకు మంటలు అంటుకుని పేలిపోయాయి. పేలుడు ధాటికి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జనానికి తీవ్రంగా గాయపడ్డారు. సభ వేదిక వద్దకు ఎంపీ, ఎమ్మెల్యే వచ్చిన సమయంలో కార్యకర్తలు టపాసులు పేల్చారు. నిప్పురవ్వలతో గుడిసెకు నిప్పంటుకుని క్షణాల్లో మంటలు చెలరేగాయి. గుడిసెకు అంటుకున్న మంటల్ని ఆర్పేందుకు జర్నలిస్టులతో పాటు సిఐ, పోలీసులు ప్రయత్నించారు.
మంటల్ని ఆర్పుతుండగానే ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటలు వ్యాపించడంతో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులతో పాటు మరికొందరు జర్నలిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి.
బందోబస్తు విధుల్లో ఉన్న సిఐతోపాటు గన్మెన్లకు కాళ్లు విరిగిపోయాయి. మరికొందరికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. ఈ ప్రమాదంలో పదిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. వైరా నియోజక వర్గంలోని ఇల్లందుకు సమీపంలో ఘటన చోటు చేసుకుంది.
ప్రమాదం జరిగిన వెంటనే ప్రజాప్రతినిధులతో పాటు పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పేలుడులో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఖమ్మం ఆస్పత్రిలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా మంత్రి అధికారులను ఆదేశించారు.
కాగా, సిలిండర్ పేలడానికి, బిఆర్ఎస్ సమావేశంకు సంబంధం లేదని ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సభా స్థలికి 200మీటర్ల దూరంలో ఉన్న గుడిసెలో పేలుడు జరిగిందని, ఎండ తీవ్రత తోడు కావడంతో ప్రమాద తీవ్రంగా ఉందని ఆయన చెప్పారు. వైద్యులు అవసరాన్ని బట్టి బాధితులను తరలించే ఏర్పాటు చేస్తారని, మెరుగైన వైద్యం అందిస్తామని, బాధితులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి సమీపంలో ఊహించని రీతిలో సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలవడం బాధాకరమని పేర్కొన్నారు.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో వున్న ఎంపీ నామా నాగేశ్వర్ రావులకు ఫోన్లు చేసి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. తాము అండగా వుంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.