2014 ఎన్నికల ముందు `కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదంతో బిజెపి ప్రధాని అభ్యర్థిగా వచ్చిన నరేంద్ర మోదీ అఖండ విజయం సాధించడమే కాకుండా, చరిత్రలో మొదటిసారిగా పార్లమెంట్ లో అధికారికంగా కాంగ్రెస్ కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా చేయగలిగారు.
అప్పటి నుండి ఆ పార్టీ క్షీణిస్తూ వస్తున్నది. ఆ పార్టీ ప్రాబల్యం నాలుగైదు, రాష్ట్రాలకు పరిమితమవుతుంది. ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలలో ఆ పార్టీ కనీసం ప్రధాన ప్రతిపక్షం కూడా కాలేకపోయింది.
“కాంగ్రెస్-ముక్త్ భారత్” కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిజెపి తరహాలో పనిచేస్తున్నారని ఆర్ఎస్ఎస్-అనుకూల బెంగాలీ వార్తాపత్రికలోని ఒక కధనం పేర్కొంది. బిజెపికి జాతీయ స్థాయిలో ప్రత్యామ్న్యాయం తాము కాక మరొకరు రాలేరని, ఆ పార్టీ ఏదో ఒకరోజుకు ప్రజా వ్యతిరేకతకు గురయితే, తామే తిరిగి అధికారంలోకి రాగలమని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కలల ప్రపంచంలో విహరిస్తున్నారు.
అయితే మొన్నటి వరకు కాంగ్రెస్ లేకుండా బిజెపికి వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యామ్న్యాయం సాధ్యం కాదని అంటూ వస్తున్న పలు ప్రతిపక్షాలు సహితం ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నంతకాలం బిజెపిని ఎదుర్కోవడం సాధ్యం కాదనే నిర్ణయానికి వస్తున్నాయి. అందుకనే ముందుగా బిజెపిని వ్యతిరేకించడం ఏమొగాని అవశేషంగా అయినా కాంగ్రెస్ లేకుండా చేయాలనే ప్రయత్నాలు ప్రారంభించాయి.
ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మొదటి నుండి అటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సహితం కాంగ్రెస్ రాజకీయ ఉనికిని ప్రశ్నార్ధకరం చేసే పనిలో పడ్డారు.
ఆమె కూడా `కాంగ్రెస్ ముక్త్ భారత్’ మార్గంలోనే ప్రయాణం సాగిస్తున్నట్లు బెంగాలీ వార్త పత్రిక `స్వస్తిక్’ ఈ మధ్య ప్రచురించిన “కేనో ఇతిహాస్ ముచ్తే చైచెన్ మమతా, శిల్పో అగ్రోహో నా సోనియా ఖోటోమ్? (మమత తన చరిత్రను ఎందుకు తుడిచివేయాలని ప్రయత్నిస్తోంది, పెట్టుబడులను ఆకర్షించడమా లేక సోనియాను నాశనం చేయడమా)” అన్న కధనంలో తెలిపింది.
బెనర్జీ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కావడం, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహించే ప్రధాన పెట్టుబడుల సదస్సును ప్రారంభించేందుకు ఆయనను ఆహ్వానించడం గురించి ఈ కధనంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె పార్టీకి మమతా ఈ మధ్యకాలంలో దూరం పాటించడాన్ని ఈ కధనంలో రచయిత నిర్మల్య ముఖోపాధ్యాయ ప్రజల దృష్టికి తీసుకొచ్చారు.
యుపిఎకు, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా బెనర్జీ ఇటీవల చేసిన పలు ప్రకటనలను ఎత్తి చూపుతూ, వ్యాసంలోని ఒక పేరా ఇలా ఉంది: “మమతార్ ఈ పాల్తే జావో తేకే పోరిస్కర్, ఏయ్ మమతా షే మమతా నోయ్. నరేంద్ర మోదీ స్వప్నో కాంగ్రెస్-ముక్త్ భారత్. అపాప్తోతో మమతా సేయ్ సప్నేర్ షరీక్ బోలే అమర్ ధరోనా. (అదే మమత కాదని ఆమె మారుతున్న వైఖరిని బట్టి అర్థమవుతోంది. నరేంద్ర మోదీ ఆశించిన కాంగ్రెస్ ముక్త్ భారత్ కోసమే ఇప్పుడు ఆమె కూడా కల కంటున్నట్లు నేను భావిస్తున్నాను. అందుకే ఆ కలను సాకారం చేసుకోవడానికి ఆమె తన చరిత్రనే చెరిపివేయడానికి సిద్దపడుతున్నది).”
ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ఈ వార్త పత్రిక మమతా, ప్రధాని ప్రధాని మోదీ రాజకీయ మార్గాలను అనుసంధానం చేసే ప్రయత్నం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నది. ఈ కధనాన్ని ఆసరాగా చేసుకొని మమతా- బిజెపిల మధ్య రహస్య అవగాన ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
అయితే ఈ పత్రిక సంపాదకుడు తిలక్ రంజన్ బేరారచయిత వ్యక్తిగత అభిప్రాయాలని స్పష్టం చేశారు. తమ పత్రికలో నిత్యం వ్యాసాలు వ్రాసేవారు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెబుతూ ఉంటారని, అంత మాత్రం చేత అవి తమ అభిప్రాయాలని భావింపరాదని తేల్చి చెప్పారు.
పత్రిక మాజీ ఎడిటర్ బిజోయ్ అధ్యా: “కాలమ్ సమకాలీన రాజకీయాలకు ప్రతిబింబం. ఇటీవలి రాజకీయ కార్యకలాపాలను గమనించిన తర్వాత ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు” అంటూ వివరించారు.