విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర మంత్రి ప్రకటన ఆశాజనకంగా ఉందని అంటూ ఆయన స్వాగతించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవ్వకుండా, కార్మికుల పక్షాన తొలి నుండి పోరాడుతూ, కేంద్రంతో సంప్రదింపులు జరిపిన ఏకైక పార్టీ జనసేన అని గుర్తు చేశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ అనేది తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడినదని తెలిపారు. 32 మంది ప్రాణ త్యాగాలతో.. ప్రాంతాలకు అతీతంగా సాగిన ఉద్యమాల ఫలితంగా సిద్ధించినదే విశాఖ ఉక్కు పరిశ్రమ అని అంటూ ఇంతటి ఘన నేపథ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండాలన్నది జనసేన పార్టీ ఆకాంక్ష అని ఆయన చెప్పారు.
ఈ పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం ప్రకటన వచ్చినప్పుడు స్పందించి ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసినప్పుడు వారు సానుకూలంగానే స్పందించారని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ స్పందన ఎంతో ఆశావాహంగా కనిపించిదని తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి విశాఖ ఉక్కుతో తెలుగు ప్రజలకున్న భావోద్వేగ బంధాన్ని తెలియచేసి ఈ పరిశ్రమను ప్రత్యేకంగా చూడాలని కోరినట్లు ఆయన చెప్పారు.
ఈ క్రమంలో గురువారం కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ‘విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయాలనుకోవడం లేదు. దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదు’ అని చేసిన ప్రకటన పట్ల జనసేన అధినేత హార్థం ప్రకటించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో రైతులు తమ భూములను త్యాగం చేశారని, ఇందులో కొందరికి ఇప్పటికీ సెటిల్మెంట్ కాలేదని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి పరిశ్రమపై రాష్ట్ర పాలకులు సైతం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, కానీ, వారికి తొలి నుంచీ చిత్తశుద్ధి లోపించిందని ఆక్షేపించారు.