టిఎస్పిఎస్సి పేపర్ లీక్ కేసులో నిందితులు సాయి లౌకిక్, సుస్మిత ఇళ్లలలో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డిఎవొ పరీక్షలకు సంబంధించిన పేపర్ కోసం ప్రవీణ్‌కు వీరు రూ.6 లక్షలు చెల్లించినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. దీంతో సిట్ అధికారులు లౌకిక్, సుస్మితలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
కేసు విచారణలో భాగంగా శనివారం ఖమ్మంలోని లౌకిక్ ఇంట్లో సిట్ అధికారులు తనిఖీలు చేశారు. కాగా ఖమ్మం జిల్లాకు చెందిన సాయి లౌకిక్, సుష్మిత దంపతులను కొద్ది రోజుల క్రితం డిఎవొ ప్రశ్నపత్రం కొనుగోలు కేసులో అరెస్టు చేశారు.
వీరిద్దరిని శుక్రవారం సిట్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మొదట వీరిద్దరు చంచల్‌గూడ జైలులో ఉన్నారు. వారి నుంచి మరింత సమాచారం రాబట్టాలని న్యాయస్థానంలో వారి కస్టడీని కోరుతూ పిటిషన్ వేశారు. గురువారం ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన న్యాయస్థానం వారిని మూడు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది.
డిఎవొ పరీక్షకు హాజరైన అభ్యర్థుల లిస్ట్ ను కూడా తయారు చేస్తున్నారు. లీకేజీ నిందితులతో వీరిలో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనే దిశగా ఆరా తీస్తున్నారు. ఇదిలావుండగా.. టిఎస్పిఎస్సి పేపర్ లీక్ కేసులో నిందితులిద్దరికీ ఆ పేపర్లున్న సిస్టమ్ పాస్ వర్డ్ ఎలా తెలిసిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ శంకర లక్ష్మి పాస్వర్డ్, యూజర్ ఐడి ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డికి ఎలా తెలిసాయి? అనేది మిస్టరీగా మారింది. ఇప్పటి వరకు ఈ కేసులో 18 మంది నిందితులను గుర్తించారు. వీరిలో 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
కాగా. పేపర్ లీక్ లో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌లను కోర్ట్ ఈడీ కస్టడీకి నాంపల్లీ కోర్టు అనుమతించింది. చంచల్‌గూడ జైల్లో వీళ్లిద్దరిని ప్రశ్నించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ నెల 17, 18 తేదీల్లో నిందితులను చంచల్ గూడ జైలులో ఈడీ విచారించనుంది.
ఇప్పటికే పేపర్ లీక్ కేసును సిట్ దర్యాప్తు చేస్తుండగా.. తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా.. మనీలాండరింగ్ ఆరోపణలపై టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నిందితులను ఈడీ విచారిస్తోంది.
మరోవంక, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. పలు ఉద్యోగ నియామక పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది. టీఎస్పీఎస్సీ. మే 16వ తేదీన అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించనున్నారు. మే 19న డ్రగ్స్ ఇన్స్పెక్టర్, జూన్ 28న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, జులై 18, 19వ తేదీల్లో భూగర్భ జలశాఖలో గెజిటెడ్ పోస్టులకు, జులై 20న భూగర్భ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. తదితర వివరాల కోసం టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.