మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ మరింత దూకుడు పెంచింది. వైఎస్ వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
ఆదివారంతెల్లవారుజామున వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి ఉంటున్న పులివెందులలోని ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. అక్కడ ఆయన్ను విచారించిన తర్వాత కడపకు తీసుకెళ్లారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్ విషయాన్ని ముందుగా కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
అరెస్ట్ మెమోను భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మీకి అందజేశారు సీబీఐ అధికారులు. భాస్కర్ రెడ్డిపై సెక్షన్ 120B, రెడ్ విత్ 302, 201 కేసులు నమోదు చేశారు. వివేకా హత్యకేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఆదివారం మధ్యాహ్నం సీబీఐ మేజిస్ట్రేట్ ముందు వైఎస్ భాస్కర్ రెడ్డిని హాజరు పరుస్తామని సీబీఐ అధికారులు తెలియజేశారు. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని చెబుతున్నారు. వివేకా హత్య కు ముందు, తరువాత నిందితులను భాస్కర్ రెడ్డి తమ ఇంటికి పిలిపించి మాట్లాడారని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. సాక్ష్యులుగా వైఎస్ లక్ష్మీ, పీ జనార్దన్ రెడ్డిని చేర్చారు.
మరోవైపు, హైదరాబాద్ లోని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి కూడా సీబీఐ అధికారుల మరో బృందం వెళ్లింది. ప్రస్తుతం అవినాష్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీబీఐ అధికారుల అదుపులో ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఉన్నాడని తెలుస్తోంది. ఇటీవల అవినాష్‌రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
వివేకా హత్య జరిగిన రోజు అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలతో కలిసి వైఎస్ భాస్కరరెడ్డి ఇంట్లోనే ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా సీబీఐ అధికారులు ఆధారాలు సేకరించారు. హత్య కుట్రలో ఉదయ్‌కుమార్‌రెడ్డి పాత్ర కూడా ఉందనే అనుమానంతో అరెస్టు చేసినట్లు తెలిసింది.
మరోవైపు.. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి ఇండ్లకు సీబీఐ అధికారులు చేరుకోవడంతో పెద్ద ఎత్తన వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. సిబిఐ అరెస్ట్ ల పర్వానికి దిగిన నేపథ్యంలో విచారణ త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.