తెలంగాణ ప్రజలకు వైసీపీ నాయకులు క్షమాపణలు చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. నేతలు వేరు.. ప్రజలు వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు చేస్తే నేతలు, ప్రభుత్వాలపై చేయాలి గానీ తెలంగాణ ప్రజలు, రాష్ట్రంపై చేయడం సరైనది కాదని హితవు చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం మంచిదికాదని పేర్కొంటూ వైసీపీ నాయకులు, మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
‘రెండు మూడు రోజులుగా తెలంగాణ మంత్రి ఒకరు ఆంధ్రప్రదేశ్‌పై వ్యాఖ్యలు చేయడం దానికి ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు విమర్శలు చేయడం.. ఈ క్రమంలో హద్దులు దాటి మాట్లాడటం ఇబ్బందికరంగా మారింది. గతంలో కూడా నాయకులకు నేను ఒకటి చెప్పాను. పాలకులు వేరు. ప్రజలు వేరు. పాలకులు చేసిన వ్యాఖ్యలతో ప్రజలకు సంబంధం లేదు’ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
“మంత్రి హరీశ్ రావు ఏ సందర్భంగా వ్యాఖ్యలు చేశారో తెలియదు. దానికి ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు, మంత్రులు తెలంగాణ ప్రజలను తిట్టడం, తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా మనస్తాపం కలిగించింది. దయచేసి వైసీపీ నాయకులకు నా విన్నపం.. నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడండి” అని హెచ్చరించారు.
సదరు తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కించపరిచేలా ఉన్నాయి అనుకుంటే ఆయన్నే విమర్శించండి. అంతేకానీ తెలంగాణ ప్రజలను వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులు దీనిపై స్పందించాలని ఆయన కోరారు. “మీకు తెలంగాణలో ఇండ్లు, వ్యాపారాలు ఉన్నాయి. బొత్స వంటి వాళ్లు ఇక్కడ వ్యాపారాలు చేసినవాళ్లే కదా? బొత్స కుటుంబానికి ఇక్కడ కేబుల్ వ్యాపారం ఉండేది” అని గుర్తు చేశారు.
దయచేసి మంత్రివర్గంలో ఎవరైనా అదుపుతప్పి మాట్లాడితే తోటి మంత్రులతో పాటు ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలను ఖండించాలని పవన్ కళ్యాణ్ కోరారు. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.