ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లంతా సాక్షి పేపర్ కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జిఓలను విడుదల చేసిందని పేర్కొంటూ ఉషోదయ పబ్లికేషన్స్ ఆధ్వర్యాన ఈనాడు దాఖలు చేసిన కేసు విచారణను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.
వాలంటీర్లకు నెలనెలా రూ.200 మంజూరు చేసి, సాక్షి పత్రిక కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు జిఓలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉషోదయ పబ్లికేషన్స్ సవాల్ చేసిన పిటిషన్పై హైకోర్టు స్టే విధించింది. దీంతో సుప్రీం కోర్టులో ఉషోదయ పబ్లికేషన్స్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ను సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్పై విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు కోరింది.
న్యాయ, పరిపాలన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విచారణను ఎపి హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సిజెఐ డివై చంద్రచూడ్ తెలిపారు. ఢిల్లీ హైకోర్టుకు విచారణను బదిలీ చేయడం వల్ల ఏపీ హైకోర్టుపై నమ్మకం పోతుందని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించగా.. అలాంటి అభిప్రాయానికి తావివ్వకుండా ఉత్తర్వులు ఇస్తామమన్న చీఫ్ జస్టిస్ తెలిపారు.
ఇది 2 పత్రికల మధ్య వ్యవహారంగా కనిపించడం లేదని, రెండు పార్టీల మధ్య వ్యవహారంగా కనిపిస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రజాధనాన్ని వాలంటీర్లకు బదిలీ చేసి ‘సాక్షి’ పత్రికను కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఉషోదయా సంస్థ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
