పుట్టిన ఊరు, కన్నతల్లి, మాతృభాషను ఎప్పటికీ మరిచిపోలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. తన ఉన్నతికి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని చెప్పారు.
సీజేఐ స్వగ్రామం కృష్ణ జిల్లా పొన్నవరంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ పొన్నవరంతో తనకు ప్రత్యేక అనుబంధముందన్నారు. పొన్నవరం, కంచికచర్లలో తన ప్రాథమిక విద్యాభ్యాసం జరిగిందని, చిన్నప్పుడు ఉపాధ్యాయులు తనను ఎంతో ప్రేమగా చూసేవారని గుర్తు చేసుకున్నారు.
గ్రామంలోని రోడ్లు, పొలాలు, చెరువులు తనకు ఇంకా గుర్తున్నాయన్నారు. అన్ని సమస్యల పరిష్కారానికి ఐకమత్యమే జౌషదమని చెబుతూ తెలుగువారి గొప్పదనం మరింత పెంచేలా మనం ప్రవర్తించాలని జస్టిస్ రమణ సూచించారు. తెలుగువారి గొప్పదనం గురించి ఢిల్లీలో అనేక మంది చెబుతారని.. తమ రాష్ట్రాల్లోని కట్టడాలను తెలుగు వాళ్లే నిర్మించారని చెప్తుంటారని పేర్కొన్నారు.
తెలుగు జాతికి సరైన గుర్తింప లేదనే ఆవేదన తనలోనూ ఉందని చెబుతూ తెలుగు బాష, సంస్కృతి, సంప్రదాయాలు, ఛైతన్యాన్ని పటిష్ట పరుచుకోవాలని సూచించారు. కరోనా కష్ట కాలంలో వ్యాక్సిన్ను తయారు చేసిన భారత్ బయోటిక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా తెలుగువాళ్లు కావడం గర్వించదగ్గ విషయమని చెప్పారు.
అఫ్ఘానిస్థాన్లోని పార్లమెంటు భవనాన్ని కూడా తెలుగువా ళ్లే నిర్మించడం గొప్ప విషయమని చీఫ్ జస్టిస్ కొనియాడారు. అయితే తెలుగుజాతికి సరైన గుర్తింపు లేదనే ఆవేదన కూడా తనలో ఉందని చెప్పారు.
రైతులు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ వారికి గిట్టుబాటు ధర లేకపోవడం , భూములకు సంబంధించిన సమస్యలూ ఉన్నాయని వివరించారు. తెలుగువాడిలా భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో తాను ఉన్నానంటే ప్రజలందరి అభిమానం, ఆశీస్సులతోనేనని. దీన్ని మార్చిపోనని చెప్పారు.
ఎంత ఎదిగినా మాతృభూమిని మర్చిపోలేదన్నారు. తెలుగు ప్రజలు గర్వపడేలా .తెలుగు జాతి కీర్తిని, ఔన్నత్యాన్ని , గొప్పతనాన్ని చాటిచెప్పేలా ప్రవర్తిస్తానన్నారు. దీఇకి భిన్నంగా ప్రవర్తించబోనని మాటిస్తున్నట్లు చెప్పారు.