తిరుమల తిరుపతి దేవస్థాన విజిలెన్స్ అధికారుల వలలో శాసనమండలి సభ్యుడు షేక్ షాబ్జీ చిక్కుకున్నాడు. తరుచూ ఆయన తిరుమల శ్రీవారి దర్శనానకి వస్తుండడంతో అతడిపై విజిలెన్స్ వింగ్ అధికారులకు అదనపు ఈవో కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు.
దీంతో వారు ఎమ్మెల్సీని తనిఖీ చేయగా ఫోర్జరీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకువెళ్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నెల రోజుల్లో 19 సిఫార్సు లేఖలు జారీ చేసి ఆరుగురి నుంచి లక్ష రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. భక్తుల ఫిర్యాదుతో ఎమ్మెల్సీ షాబ్జీని అదుపులోకి తీసుకున్నారు.
విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో అతడిపై కేసు నమోదైంది. శ్రీవారి దర్శనాల్లో ఎమ్మెల్సీ షాబ్జీ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామని టీటీడీ విజిలెన్స్ వీజీవో గిరిధర్‌రావు స్పష్టం చేశారు.
షాబ్జీ సిఫార్సు చేసిన భక్తుల ఆధార్ కార్డులు నకిలీవిగా తెలిసిందన్నారు. 14 మందికి టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ కోరారని అందుకు అదనపు ఈవో కార్యాలయం 10 టికెట్లు జారీ చేసిందని తెలిపారు. లక్షా ఐదు వేలు తీసుకున్నట్లు భక్తులు తెలిపారన్నారు.
డ్రైవర్ రాజుతో పాటు ఎమ్మెల్సీని పోలీసులకు అప్పగించామని ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 2021లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గ ఉపాధ్యాయ కోటా నుంచి షేక్ షాబ్జీ యూటీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు.
