భారత్‌కు చెందిన దగ్గు మందులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సిరప్‌ల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. పంజాబ్‌లో ఉత్పత్తి అయిన, హర్యానా సంస్థ విక్రయిస్తున్న, పసిఫిక్ సమీప దీవులకు సరఫరా అవుతున్న దగ్గు సిరప్‌లలో విషపూరిత కలుషిత పదార్థాలు ఉన్నట్లు ఓ నివేదికలో డబ్ల్యుహెచ్ఒ పేర్కొంది.
మార్షల్ దీవులు, మైక్రోనేషియాలోని ఒక బ్యాచ్ సిరప్‌లలో అధిక శాతం డైథైలీన గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్‌లను కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఇవి మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఈ సిరప్‌లను పంజాబ్‌కు చెందిన క్యూపి ఫార్మాకెమ్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తుండగా, హర్యానాలోని త్రిలియం ఫార్మా పేరుతో విక్రయిస్తున్నారని అత్యవసర వైద్య హెచ్చరికలో డబ్ల్యుహెచ్ఒ పేర్కొంది.
ఇప్పటివరకు పైన పేర్కొన్న తయారీ దారుల గాని, విక్రయదారులు గాని ఈ ఉత్పత్తుల భద్రత, నాణ్యతపై హామీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ ఉత్పత్తులు పశ్చిమ పసిఫిక్ ప్రాంతాలలోని ఇతర దేశాల్లో మార్కెటింగ్ అధికారాలను కలిగి ఉండవచ్చని, అక్కడి నుండి ఇతర దేశాలు, లేదా ప్రాంతాలకు అనధికారిక మార్కెట్ల ద్వారా పంపిణీ కావచ్చని పేర్కొంది.
ఈ ఉత్పత్తులు సురక్షితం కానివని, ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యానికి ముప్పు కలిగించవచ్చు లేదా మరణానికి కూడా దారితీయవచ్చని హెచ్చరించింది. రెండు హానికారక రసాయానాల కారణంగా పొత్తి కడుపు నొప్పి, వాంతులు, డయేరియా, తలనొప్పి, తీవ్రమైన కిడ్నీల వ్యాధికి గురికావడంతో మరణం సంభవించవచ్చని పేర్కొంది.
అయితే తాము 2020లో 18,336 దగ్గు సిరప్‌లను కంబోడియాకు ఎగుమతి చేశామని ఫార్మాకెమ్ ఎగ్జిక్యూటిఈవ్ సుధీర్ పాథక్ పేర్కొన్నారు. మార్షల్ దీవులు, మైక్రోనేషియాలకు తాము ఎగుమతి చేయలేదని, అక్కడికి ఎలా చేరాయో తమకు తెలియదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని, గడువు ముగిసిన సిరప్‌లను వారు ఎందుకు పరీక్షించారనే అంశంపై స్పష్ట లేదని పేర్కొనడం గమనార్హం.