సైబర్ నేరాలను అరికట్టడం, సైబర్ సేఫ్టీకీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంలో తెలంగాణ పోలీస్ దేశంలోనే ముందంజలో ఉందని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్, డిజిటల్ ఇండియా సంయుక్తంగా సైబర్ సెక్యూరిటీ -2023 అనే అంశంపై న్యూఢిల్లీ నుండి ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన సదస్సులో డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడారు.
“నేషనల్ అర్కిటెక్చర్ ఫర్ సైబర్ స్పేస్ మేనేజ్మెంట్ బై స్టేట్ గవర్నమెంట్” అనే అంశంపై డీజీపీ మాట్లాడుతూ సైబర్ నేరాలను దర్యాప్తు చేసి, వాటిని అరికట్టేందుకుసైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ బ్యూరోలో 500 మంది అధికారులు, సిబ్బందిని నియమించామని వివరించారు.
సైబర్ నేరాల నియంత్రణకు ఇప్పటికే ఏర్పాటు చేసిన తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 1930, 100ల ద్వారా సైబర్ నేరాల ఫిర్యాదులను నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. సైబర్ ఆధారిత ఆర్థిక నేరాలకు సంబంధించి రూ. 65 కోట్లను నిలిపివేశామని చెప్పారు.
పెరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని 800 పోలీస్ స్టేషన్లలో సైబర్ క్రైమ్ లు ఎదుర్కొనేందుకు పోలీస్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. సైబర్ వారియర్లుగా తయారు చేశామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 2019లో 2691 సైబర్ ఆధారిత కేసులు నమోదు కాగా, 2020లో 5024, 2021లో 10,30 , 2022లో 15,217 నమోదయ్యాయని వివరించారు. మైక్రోసాఫ్ట్ తో సహా ప్రపంచంలోని దాదాపు 600 ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్ లో ఏర్పాటయ్యాయని, దాదాపు 10 లక్షల మంది ఐటీ ఆధారిత ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ ఇక్కడ ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో సైబర్ లిటరేట్స్ గణనీయంగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మాదిరిగానే సైబర్ నేరాలు పెరిగాయని తెలిపారు.