ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌ను మాకివ్వండి అని ఏపీ అధికారులను తెలంగాణ అధికారులు పట్టుబడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చోటు చేసుకుని తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతున్నా ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరడం లేదు.
తాజాగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ అంశంపై జరిగిన సమావేశంలోనూ మరోసారి ఇదే పరిస్థితి ఎదురైంది. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌తో తెలంగాణ ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయని, కాబట్టి దానిని తమకు వదిలేయాలని ఏపీ అధికారులను తెలంగాణ అధికారులు కోరారు.
దానిని తమకు ఇచ్చేస్తే పటౌడీ హౌస్‌లో తమకున్న ఏడెకరాలకు పైగా స్థలాన్ని తీసుకుని అక్కడ కొత్త భవనాన్ని నిర్మించుకోవాలని ఏపీ అధికారులకు సూచించారు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న ప్రకారం రాష్ట్రం వెలుపల ఆస్తులను సైతం 58:42 నిష్పత్తిలో పంచాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది.
ఈ లెక్కన మొత్తం 19.73 ఎకరాల స్థలంలో తెలంగాణకు 8.41 ఎకరాలు (41.68%) భూభాగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11.32 ఎకరాల (58.32%) స్థలాన్ని పంచాల్సి ఉంటుంది. అయితే, మొత్తం 19.73 ఎకరాల స్థలాన్ని తమకే అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది.
నిజాం ఆస్తి ‘హైదరాబాద్ హౌజ్’ను కేంద్ర ప్రభుత్వం తీసుకుని, అందుకు బదులుగా ఇచ్చిన స్థలంలో ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మించారని, నిజాం ఆస్తికి వారసత్వం తమకే ఉందని, ఆ ప్రకారం మొత్తం స్థలాన్ని తెలంగాణకే కేటాయించాలని వాదిస్తోంది.