కాపు రిజర్వేషన్ చాలా సున్నితమైన అంశమని పేర్కొంటూ కోర్టులో వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని ప్రభుత్వంపై ఇతర మార్గాల్లో ఒత్తిడి తీసుకురావాలని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం మాజీ హోమ్ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్వస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్యకు సూచించింది. లేకపోతే కోర్టులో పెండింగ్‌లో ఉందంటూ ప్రభుత్వం జాప్యం చేసే అవకాశం లేకపోలేదని తెలిపింది.
విద్యా, ఉపాథి రంగాల్లో ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ తీసుకు వచ్చిన చట్టాన్ని, జీవో 60ను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ వాఖ్యలు చేసింది.
దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యల తో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. కాగా, కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ని ఆదేశిస్తూ హరిరామజోగయ్య వ్యాజ్యంపై జూన్ 26వ తేదీన తుది విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.
హరిరామజోగయ్య తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ జోక్యం చేసుకుంటూ గత ప్రభుత్వ హయాంలో కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటా 10 శాతంలో ఐదు శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ చట్టం తెచ్చిందని గుర్తుచేశారు. దీనిపై సుప్రీం కోర్టులో దాఖలైన వ్యాజ్యాలను కొట్టేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం కాపులకు ఇవ్వటాన్ని సుప్రీం కూడా సమర్ధించిందని అయితే అమల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించటంలేదని పేర్కొన్నారు. విద్యా, ఉపాథి అవకాశాల్లో ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్ధించారు.
ఇదిలా ఉండగా ఈడబ్ల్యూఎస్ కోటా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిందని ఇందులో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించటం రాజ్యాంగ విరుద్ధమని మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హరిరామజోగయ్య వ్యాజ్యంపై స్పందించిన ధర్మాసనం గతంలో కౌంటరు దాఖలుకు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా వ్యతిరేక వ్యాజ్యం దాఖలు కావటంతో దీనిపై కూడా స్పందించాలని న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు ధర్మాసనాన్ని అభ్యర్థించారు.