మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి చుక్కెదురవుతున్నది. మూడు రోజులపాటు జరిగిన సుదీర్ఘ విచారణ అనంతరం శుక్రవారం బెయిల్ ఇచ్చే విషయమై తీర్పు ఇవ్వగలదని ఎదురుచూసిన ఎంపీకి ఈ రోజు తీర్పు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేయడంతో నిరాశ ఎదురైంది.
పైగా, హైకోర్టుకు శనివారం నుండి జూన్ 2 వరకు వేసవి సెలవలు కావడంతో తర్వాతే తీర్పు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. దీంతో జూన్ 5కు విచారణ వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ రోజు వాదనలు విన్నప్పటికీ ఈ రోజు తీర్పు ఇవ్వలేనని చెబుతూ బెయిల్ పిటిషన్‌పై తీర్పు అన్ని రోజులు రిజర్వ్‌లో పెట్టడం బాగుండదని, అత్యవసరమైతే చీఫ్ కోర్టును అభ్యర్థించాలని హైకోర్టు సూచించింది.
పైగా, సీబీఐ తనపని తాను చేసుకు పోవచ్చునని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకునేది ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయని పేర్కొంటూ సీబీఐ విచారణ చేసుకోవచ్చునని చెప్పారు. అంటే, అవసరమనుకొంటే సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసుకోవచ్చనే సంకేతం ఇచ్చారు.
అంతేకాదు కేసును వెకేషన్ బెంచ్‌కు మార్చుకోవచ్చని హైకోర్టు ఇరు పక్షాలకు సూచించింది. ఇప్పటికే సీబీఐ ఈ కేసులో అవినాష్ ను అరెస్టు చేసి తీరాల్సిందేనని హైకోర్టుకు పలుమార్లు తెలిపింది. గురువారం విచారణలోనూ సీబీఐ న్యాయవాదిగా ఉన్న పీపీ నాగేంద్ర అవినాష్ ను అరెస్టు చేయకుండా కస్టోడియల్ విచారణ చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు.