2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ కిడ్నాప్, హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీకి పదేళ్ల జైలు శిక్షను ఘాజిపూర్ కోర్టు ఖరారు చేసింది. 5 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఎంపీ-ఎమ్మెల్యే కోర్ట్ ఆదేశించింది. ఈ కేసులో ముక్తార్ అన్సారీతో పాటు ఆయన సోదరుడు బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీని కూడా దోషిగా తేల్చిన కోర్టు. ఆయనకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ. లక్ష జరిమానా విధించింది.
అఫ్జల్ అన్సారీ ప్రస్తుతం ఘాజీపూర్ ఎంపీగా ఉన్నారు. కోర్టు తీర్పుతో ఆయన తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(ఈ) నిబంధన ప్రకారం రెండేండ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు.
జైలు శిక్షాకాలంతోపాటు మరో ఆరేండ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకూ అనర్హులవుతారు. సెక్షన్ 8లో పేర్కొన్న నేరాలకు ఈ అనర్హత వేటు వర్తిస్తుంది. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2019 పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో తన ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ తన రాజకీయ జీవితాన్ని సీపీఐతో ప్రారంభించారు. 1985లో మొదటిసారి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1989, 91, 93, 96 వరకు వరుసగా సీపీఐ పార్టీ తరఫున విజయం సాధించారు. అనంతరం 1996 ఎన్నికల్లో ఎస్పీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2002 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన కృష్ణానంద్ రాయ్ చేతిలో ఆయన ఓడిపోయారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో 2004లో పార్టీ ఆయనకు లోక్‌సభ టిక్కెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి చెందిన మనోజ్ సిన్హాపై విజయం సాధించారు. 2005 నవంబర్ 29న ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య తర్వాత అతనిపై బలమైన కేసులు నమోదయ్యాయి. కోర్టులో ఎన్నో అభియోగాల అనంతరం ఆయన జైలుకు వెళ్లాడు.
జైలుకు వెళ్లే సమయంలో సమాజ్ వాదీ పార్టీతో రాజకీయ విభేదాల కారణంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘాజీపూర్ పార్లమెంట్ స్థానం నుంచి బీఎస్పీ టికెట్‌పై పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన ఘాజీపూర్ ఎంపీగా ఉన్నారు.