పంజాబ్ లోని లూథియానా నగరం గియాస్పురా ఏరియాలో ఆదివారం ఉదయం అకస్మాత్తుగా గ్యాస్ లీకవడంతో 11మంది మరణించగా, మరో నలుగురు ఆస్పత్రిపాలయ్యారు. వెంటనే ఆ మొత్తం ప్రాంతాన్ని పోలీసులు సీల్ చేశారు. సహాయక చర్యల నిమిత్తం అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి.
మరణించిన వారిలో ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు వున్నారని జిల్లా ప్రజా సంబంధాల కార్యాలయం తెలిపింది. మరో నలుగురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు, జిల్లా యంత్రాంగం, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సంఘటనా ప్రాంతంలో వున్నాయి.
బాధితులకు అవసరమైన సాయాన్ని అందచేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈసంఘటనపై దర్యాప్తు జరిగిన తర్వాతనే అసలు కారణం తెలుస్తుందని లూథియానా వెస్ట్ ఎస్‌డిఎం స్వాతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఉదయం 7.15గంటల సమయంలో ఆకస్మిక గ్యాస్ లీక్, మృతుల గురించి తమకు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. వెంటనే సంఘటనా ప్రాంతానికి వెళ్లగా స్పృహ కోల్పోయి రోడ్డుపక్కన పడి వున్నవారు కనిపించారని తెలిపారు.
మురికి కాల్వల మేన్హౌల్స్ నుండి గ్యాస్ లీకయిందని తొలుత అధికారులు భావించారు గానీ తర్వాత అది కాదని వెల్లడైంది. ఎన్డిఆర్ఎఫ్ బృందాలు తమవద్ద గల ఎయిర్‌క్వాలిటీ సెన్సార్లతో పరీక్షించగా, గాల్లో హైడ్రొజన్ సల్ఫైడ్ గ్యాస్ స్థాయి ఎక్కువగా వున్నట్లు తేలింది. బహుశా ఈ ప్రమాదానికి ఇది కారణమై వుండవచ్చని భావిస్తున్నారు. కాగా లూథియానా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.