వలసదారులను అడ్డుకోవద్దని పోప్ ఫ్రాన్సిస్ హంగేరియన్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుడాపెస్ట్‌లోని కొసుత్ లాజ్‌స్క్వేర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 50,000 మంది ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోప్ మాట్లాడుతూ హంగేరియన్లు జీసెస్‌ను అనుసరించాలనుకుంటే నిరుపేదలు, బాధల్లో ఉన్నవారిని ఆదుకోవాలని సూచించారు.
వలసదారులు ఆతిథ్య దేశాల సంస్కృతిని సుసంపన్నం చేయగలరని తెలిపారు. వలసదారులను అడ్డుకునేందుకు తలుపులు మూయడం బాధాకరమని, అది జీసెస్ బోధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. అలాగే యూరోప్‌లో పెరుగుతున్న జాతీయవాదం ప్రమాదాల గురించి కూడా హెచ్చరించారు. అంతకు ముందు రోజు పోప్ సెయింట్ ఎలిజిబెత్ చర్చిలో సుమారు 600 మంది శరణార్థులను కలుసుకున్నారు.
అయితే పోప్ సూచనలను హంగేరియన్ ప్రధాని విక్టర ఓర్బన్ వ్యతిరేకిస్తున్నారు. హంగేరీని వలస దేశం గా మార్చేందుకు తాను అనుమతించబోననని హెచ్చరించారు. వారు స్థానిక ప్రజల నైతిక గుర్తింపుకు అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు.
వలసదారులను అడ్డుకునేందుకు 2015లో ఓర్బాన్ సెర్బియా సరిహద్దులో స్టీల్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. దేశ రాయబార కార్యాలయాల్లో ఆశ్రయం కోరుతూ సమర్పించే దరఖాస్తులను కూడా పరిమితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది కేవలం 18 మంది మాత్రమే శరణార్థుల హోదాను పొందారు. ఇతర దేశాలతో పోలిస్ ఇది చాలా హాస్యాస్పదమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.