మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ప్రస్తుతం ఆయన డిఫాల్ట్ బెయిల్‌పై బయట ఉన్నారు. కాగా గంగిరెడ్డి బెయిల్‌ను ఇటీవల తెలంగాణా హైకోర్టు రద్దు చేసిన నేపధ్యంలో కోర్టు ఆదేశాలతో ఈనెల 5వ తేదీ శుక్రవారం కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. లేకుంటే అరెస్టు చేయాలని కోర్టు సీబిఐని ఆదేశించింది.
ఈ నేపధ్యంలో వివేకా కేసులో కీలకమైన మొదటి నిందితునిగా ఉన్న గంగిరెడ్డి నేడు సిబిఐ కోర్టుకి వచ్చారు. హైకోర్టు ఆదేశాలతో తాను లొంగిపోతున్నట్లు గంగిరెడ్డి ప్రకటించారు. ఇక నుంచి జ్యుడీషియల్ రిమాండులోకి వెళ్ళనున్నారు. బెయిల్‌పై ఉన్న గంగిరెడ్డిని అవసరమనుకుంటే సీబిఐ ప్రశ్నించే అవకాశం ఉన్నప్పటికీ వివేకా కేసులో రోజురోజుకు మారుతున్న పరిణామాల దృష్ట్యా తాజాగా కస్టడీ కోరే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.
వివేకానంద రెడ్డి హత్యకు పధక రచన జరిగిన మీదట దాన్ని అమలు చేసే విషయంలో ప్రధానంగా వ్యవహరించిన గంగిరెడ్డిని ఆయా ఆరోపణలపై 2019 మార్చి 28న ఎర్ర గంగిరెడ్డిని అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అరెస్ట్ చేసింది. ఆతర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏర్పాటైన సిట్ సకాలంలో ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో గంగిరెడ్డికి 2019 జూన్ 27న పులివెందుల కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. వివేకా హత్య కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు వెలువడ్డాక, దర్యాప్తు తెలంగాణాకు మారాక అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
తాజాగా భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిల అరెస్టు అనంతరం కడప ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి న్యాయపరమైన అడ్డంకులు సీబీఐ ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో గంగిరె డ్డి బెయిల్‌పై బయట ఉండటం కూడా ప్రస్తావనకు వచ్చింది. మొదటి నిందితుడు బెయిల్‌పై బయట ఉంటే దర్యాప్తుకు విఘాతం కలుగుతుందనే కోణంలో ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం బెయిల్ రద్దు చేస్తూ ఏప్రిల్ 27న కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.