టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రేణుక భర్త డాక్యా నాయక్ నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసిన వ్యవహారంలో సిట్ పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కోస్గీ భగవంత్ కుమార్, కోస్గీ రవికుమార్ అనే ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
తన తమ్ముడు కోస్గీ రవికుమార్ కోసం భగవంత కుమార్ పేపేర్ కొనుగోలు చేసినట్లు సిట్ పోలీసులు గుర్తించారు. ఢాక్యా నాయక్ బ్యాంకు అకౌంట్లను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీల గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కోస్గీ భగవంత్ కుమార్ విషయం బయటపడింది.
వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో కోస్గీ భగవంత్ కుమార్ పని చేస్తున్నట్లు గుర్తించారు. రెండు లక్షలకు ఢాక్యా నాయక్ వద్ద ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు తేలింది. దీంతో వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ పోలీసులు ఇప్పటికే విచారణను దాదాపు పూర్తిచేశారు. అనుమానం ఉన్న మరికొంతమందిని కూడా విచారిస్తోంది. ఇప్పటివరకు నిందితులకు రూ.33.4 లక్షలు అందినట్లు సిట్ తేల్చింది. కొంతమంది నేరుగా నగదు తీసుకోగ, మరికొంతమంది బ్యాంకు ఖాతాలో జమ చేయించుకున్నట్లు అధికారులు గుర్తించారు.
పేపర్ లీక్ చేయడం వల్ల ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్‌కు రూ.16 లక్షలు అందింది. ప్రవీణ్ కుమార్ ద్వారా రూ.10 లక్షలకు ఏఈ పేపర్‌ను రేణుక రాథోడ్ తీసుకున్నారు. ఆ తర్వాత రేణుక భర్త డాక్యా, రాజేశ్వర్‌లు కలిసి మరో ఐదుగురికి విక్రయించారు.
విక్రయం ద్వారా రాజేశ్వర్, డాఖ్యాలకు రూ.27.4 లక్షలు వచ్చినట్టు సిట్ అధికారులు తేల్చారు. వీటిల్లో రూ.10 లక్షలను ప్రవీణ్‌కుమార్‌కు ఇవ్వగా.. రాజేశ్వర్, డాక్యాలకు రూ.17.4 లక్షలు మిగిలాయి.