పల్నాడు జిల్లాలోని నల్లమల రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు పెద్ద పులుల సంచారం కలకలం రేపుతోంది. ఇటీవల దుర్గి మండలం కాకిరాల, అడిగొప్పుల అటవీ ప్రాంతంలో ఓ ఆవుపై పులులు దాడి చేసి చంపినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలంలో ఉద్రిక్తత నెలకొంది.
మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లోని శివారు పల్లెల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా పులి గురించే చర్చిస్తున్నారు. నల్లమల సమీప ప్రాంతాల్లో బెబ్బులి సంచారం అలజడి సృష్టిస్తోంది. పల్నాడులోని లోయపల్లి, గజాపురంతోపాటు వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో వ్యాఘ్రాలు ఆహారం, నీటి కోసం పొలాలు, వాగుల వెంబడి బయట సంచరిస్తున్నాయి.
పల్నాడులోని విజయపురిసౌత్ ప్రాంతంలో తరచూ పులుల సంచారం ఉంటోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 75 వరకు పులులు ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాటి సంచారం పల్నాడు జిల్లా వైపునకు వస్తున్నట్లు అంచనా వేశారు. గత నెల 26న దుర్గి మండలం గజాపురం సమీపంలో ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. పాదముద్రలను బట్టి పులేనని అటవీ అధికారులు నిర్ధారణ చేశారు.
పల్నాడు అటవీశాఖ పరిధిలో 44 వరకు బీట్లు ఉన్నాయి. ఇటీవల పులుల సంచారం పెరగడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తమయ్యారు. అటవీ అధికారులు స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. పులి నుంచి రక్షణ పొందేందుకు రైతుల పొలాల వద్ద విద్యుత్ తీగలు ఏర్పాటు చేయొద్దని హెచ్చరికలు సైతం జారీ చేశారు.
పులులు తమ పరిధిని 25 నుంచి 50 కిలోమీటర్లు విస్తరించుకుంటాయి. అందులోకి ఇతర జంతువులు విహరిస్తే అవి సహించవు. ముఖ్యంగా సంతానోత్పత్తి కోసం వాటి పరిధి నుంచి బయటకు వస్తాయి. ఆహారం, నీటి కోసం గ్రామాల వైపు వస్తాయి. ఇలా వచ్చిన పులులు కొన్ని రోజులు విహరించి, తిరిగి మాతృ స్థానానికి చేరుకుంటాయి. ఆ సమయాల్లో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
1 Comment
Respect to the courts is needed.