ఓఆర్ఆర్ తక్కువ ధరకు ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం వెనుక ఓ పెద్ద స్కామ్ ఉందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఓఆర్ఆర్ నిర్వహణను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని ఆయన విమర్శించారు.
ఓఆర్ఆర్ ఏటా ఆదాయం పెరుగుతుందే తప్ప తగ్గదని చెబుతూ. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే నగరం హైదరాబాద్ అని, అయినా ఓఆర్ఆర్కు వస్తున్న ఆదాయాన్ని తక్కువ చేసి ప్రైవేట్ సంస్థకు ఎందుకు కట్టబెట్టారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు.
30 ఏళ్లలో హెచ్ఎండిఎకు 75 వేల కోట్ల రూపాయలు టోల్ ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. ఓఆర్ఆర్ నిర్మాణం కోసం చేసిన అప్పులు అన్ని తీరిపోయాయని, అప్పులు తీరిపోతే టోల్ ప్రీ చేసే పాలసీ ఉందని ఆయన పేర్కొన్నారు.
కాని దీనికి విరుద్ధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా టెండర్ పెట్టారని ఆయన మండిపడ్డారు. ఇదో పెద్ద కుంభకోణంలా ఉందని ఆఒరిపిస్తూ 30 సంవత్సరాలకు ఎందుకు లీజుకు ఇస్తున్నారు? అని కిషన్ రెడ్డి నిలదీశారు.
టెండర్ల ప్రక్రియను తూతూ మంత్రంగా చేసి ఐఆర్బి కంపెనీకి కట్టబెట్టారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీనిపై విచారణ జరిపిస్తామని కిషన్రెడ్డి వెల్లడించారు.
కాగా, మణిపూర్లో ఘర్షణలు, హింసపై కేంద్ర మంత్రి స్పందిస్తూ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని సూచించారు. హింసతో సాధించేదేమీ లేదని స్పష్టం చేశారు. మణిపూర్లో అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.5.500 కోట్లు ఖర్చు చేసిందని ఆయన పేర్కొన్నారు. మణిపూర్ యువత హింసను పక్కన పెట్టి అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.