పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ను ఇస్లామాబాద్ లో పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. మార్చి 7న ఇమ్రాన్ ఖాన్ పై ఇస్లామాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయగా, మంగళవారం ఆర్మీ అరెస్ట్ చేసింది.
ఇస్లామాబాద్ లోని కోర్టు వద్ద ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేస్తుండగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో ఇమ్రాన్ లాయర్లకు గాయాలైనట్లు తెలుస్తుంది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన పాక్ ఆర్మీ అతనిని రహస్య ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తుంది.
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో పిటిఐ పార్టీ కార్యకర్తలు, ఇమ్రాన్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. రోడ్లపైకి వచ్చి అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని అరెస్ట్ సమయంలో ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.
కాగా ఇమ్రాన్ ఖాన్ పై దేశవ్యాప్తంగా 85 కేసులు నమోదు అయినట్లు సమాచారం. ఆయనను అరెస్ట్ చేసే క్రమంలో ఆర్మీ అద్దాలు కూడా పగలగొట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇమ్రాన్ తరపు లాయర్లకు గాయాలయ్యాయి. ఆ తరువాత ఇమ్రాన్ ను చుట్టుముట్టిన పాక్ ఆర్మీ అధికారులు ఆయనను వాహనంలోకి ఎక్కించారు.
ఈ సమయంలో ఆర్మీ అధికారులు వాహనం చుట్టూ ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశారు. ఆ తరువాత అక్కడి నుంచి ఇమ్రాన్ ఖాన్ ను రహస్య ప్రాంతానికి తరలించినట్టు సమాచారం. కాగా గతంలో ఇమ్రాన్ ఖాన్ చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి.
ఆగష్టు 27 2022న ఇమ్రాన్ ఖాన్ కు రెండు కేసుల్లో ఇస్లామాబాద్ కోర్టులో తాత్కాలిక బెయిల్ ఇచ్చాయి. అయితే తనకున్న ప్రజాదరణను దెబ్బతీయడంలో విఫలమైన ప్రత్యర్ధులు ఇప్పుడు తనను ఎన్నికల రాజకీయాల నుంచి అక్రమ పద్ధతుల్లో బయటకు గెంటెయ్యాలని చూస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ అప్పట్లో ఆరోపించారు.