సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతునే ఉంది. ఏఈఈ పేపర్ కూడా లీక్ కావడంతో, ఈ కేసులో తాజాగా మరో నలుగురిని సిట్ అరెస్టు చేసింది. ఈ నలుగురు ప్రధాన నిందితుడు ప్రవీణ్ ను ఎఈఈ పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. దీంతో ఈ నలుగుర్ని అరెస్ట్ చేశారు.
కాగా ఏఈఈ పరీక్ష పేపర్‌ను ప్రధాన నిందితుడు ప్రవీణ్ లీక్ చేసి ఒక్కో పేపర్‌ను రూ.10 లక్షలకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. చాలా మందికి ఏఈఈ పేపర్‌ను ప్రవీణ్ అమ్మాడని సిట్ అధికారులు పేర్కొంటున్నారు.
సోమవారం కూడా ముగ్గురిని సిట్ అరెస్ట్ చేసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేపర్ కొనుగోలు చేసిన ముగ్గురిని సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు ప్రవీణ్ నుండి ఈ ముగ్గురు పేపర్ ను కొనుగోలు చేసినట్లు తెలిపింది. మనోజ్, మురళీధర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని సిట్ అరెస్ట్ చేసింది. ఈకేసులో ఇప్పటివరకు 27 మంది అరెస్టు అయ్యారు.
కాగా, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ఈడీ వేసిన పిటిషన్ ను హైదరాబాద్ నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఈ లీక్ కేసులో ఇప్పటికే కొంతమందిని విచారించిన ఈడీ.. మిగతా నిందితులను విచారించడానికి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు మే 10వ తేదీ బుధవారం విచారించిన నాంపల్లి కోర్టు.. జురిడిక్షన్ కారణంగా పిటిషన్ ను డిస్మిస్ చేసింది.