ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో భద్రతా వైఫల్యాలు అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. తిరుమల పుణ్యక్షేత్రానికి ముష్కరుల నుంచి ముప్పు పొంచి ఉందని, కేంద్ర నిఘా సంస్థలు పలుమార్లు హెచ్చరిస్తున్నా అడుగడుగునా నిర్వహణ లోపం కనిపిస్తోంది.
తాజాగా గత నెల 30న ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని, సులభ కార్మికుల రూపంలో తిరుమల పుణ్య క్షేత్రంలో ఉగ్రవాదులు ప్రవేశించారని తిరుపతి జిల్లా ఎస్పి పరమేశ్వరరెడ్డికి మెయిల్ రావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తిరుమల కొండతో పాటుగా తిరుపతి, అలిపిరి ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఫేక్ ఈ మెయిల్ అని తెలియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఫేక్ మెయిల్ పంపిన వారి కోసం పోలీసులు కనిపెట్టే పనిలో పడ్డారు.
నాలుగంచెల భద్రత కలిగి, అనుక్షణం సిసి కెమెరాల నిఘా నేత్రంలో ఉండే తిరుమల పుణ్యక్షేత్రంలో ఓ భక్తుడు సెల్ ఫోన్‌తో ఆలయంలోకి ప్రవేశించి ఆనంద నిలయాన్ని చిత్రీకరించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మరోసారి ఏడు కొండలపై భద్రత సిబ్బంది వైఫల్యం బహిర్గతమైందని స్పష్టంగా తెలుస్తోంది.
ఆక్టోపస్ బలగాలతోపాటుగా టిటిడి భద్రతా వ్యవస్థ, లా అండ్ ఆర్డర్, ఎస్పిఎఫ్, అర్ముడ్ రిజర్వ్డ్ పోలీసులు, హోంగార్డ్సు, ప్రయివేట్ సెక్యూరిటీ పర్యవేక్షణలో తిరుమల ఉంటుంది. వివిధ భద్రత విభాగాలకు చెందిన దాదాపు 2 వేల మంది సిబ్బంది నిరంతరం తిరుమలలో పహారా కాస్తుంటారు.
వీరికి తోడుగా తిరుమల మొత్తం సిసి కెమెరాల నిఘాలో ఉంటుంది. తిరుమల మహాద్వారంగా పిలుచుకునే అలిపిరి మొదలుకొని తిరుమల మొత్తం దాదాపుగా 2 వేలకు పైగా సిసి కెమెరాలను టిటిడి ఏర్పాటు చేసింది. ఈ సిసి కెమెరాలను అనునిత్యం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ కమాండ్ కంట్రోల్ రూంలో ఉన్న సిబ్బంది రౌండ్ ది క్లాక్ నిఘా నేత్రంలో ఉన్న తిరుమల కొండ భద్రతను పర్యవేక్షిస్తుంటుంది. ఎప్పుడైనా దొంగతనం జరిగినా, అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపించినా నిమిషాల్లో ఆ ప్రాంతాల్లో విధుల్లో ఉన్న భధ్రతా సిబ్బందిని అలెర్ట్ చేస్తారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల బ్యాగులను తనిఖీ చేసేందుకు వైకుంఠం క్యూకాంప్లెక్సులోని కంపార్టుమెంట్లో అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్కానర్ల ద్వారా భద్రత సిబ్బంది తనిఖీ చేస్తుంటారు. ఎటువంటి నిషేధిత వస్తువునైనా గుర్తించి.. వెంటనే అప్రమత్తం అవుతారు.
మరోవైపు శ్రీవారి ఆలయంలో వందల సంఖ్యలో సిసి కెమెరాలతో నిఘా పర్యవేక్షణ ఉంటుంది. ఇంతటి నిఘాలో సైతం ఈ నెల 7వ తేదీ రాత్రి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారం నుంచి విమాన ప్రాకారం వెళ్లే మార్గంలో ఆనంద నిలయాన్ని ఓ భక్తుడు చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
స్వామి వారి దర్శనాంతరం బంగారు వాకిలి దాటిన వెంటనే వకుళమాత ఆలయానికి బయట ప్రాంతంలో నిలబడి ఆనంద నిలయాన్ని సెల్ ఫోన్‌తో చిత్రీకరించాడు. ఆ తర్వాత విమాన వెంకటేశ్వర స్వామికి సమీపంలోని మండపం వద్ద నుంచి ఆనంద నిలయాన్ని మొబైల్ ఫోన్ తో చిత్రీకరించాడు. వీటితో పాటు ఆ భక్తుడు శ్రీవారి ఆలయంలోని పలు ఉప ఆలయాలు, క్యూలైన్లను సెల్ ఫోన్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.