అవినీతి కేసులో నాటకీయ పరిణామాల మధ్య పాక్ మాజీ ప్రధాని, పీటీఐ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ మంగళవారం అరెస్ట్ కావడంతో ప్రస్తుతం ఆ దేశం అల్లర్లతో అట్టుడికిపోతోంది. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. పలుచోట్ల వాహనాలకు నిప్పుపెట్టడంతోపాటు ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆర్మీ ఆందోళన కారులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఖాన్ అరెస్ట్ తర్వాత దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన పంజాబ్ ప్రావిన్స్ లో దాదాపు 1,000 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు సుమారు 130 మంది అధికారులు గాయపడినట్లు తెలిపారు.
అల్లర్ల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్‌లో ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేసింది. 144 సెక్షన్ విధించింది. ఫైసలాబాద్‌లోని హోంమంత్రి ఇంటిపై పీటీఐ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. రావల్పిండిలో ఆర్మీ ప్రధాన కార్యాలయంపై, లాహోర్‌లోని ఆర్మీ కమాండర్ ఇంటిపై ఇమ్రాన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు.
ఆర్మీ ప్రధాన కార్యాలయం గేటును ధ్వంసం చేశారు. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసుల ముందు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇమ్రాన్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా రావల్పిండి, లాహోర్, కరాచీ, గుర్జాన్‌వాలా, ఫైసలాబాద్, ముల్తాన్, పెషావర్, మర్దాన్లలో పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు.